
ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలి
ఒంగోలు సబర్బన్: ఆర్‌డీఎస్‌ఎస్ పథకం పనులు వేగవంతం చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక సంతపేటలోని విద్యుత్ భవన్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల ముఖ్య పథకాలైన ఆర్డీఎస్‌ఎస్, పీఎం సూర్య ఘర్ పురోగతిపై లోతుగా సమీక్షించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పరివర్తకాల పనితీరు, విద్యుత్ శాఖపై ప్రజల అభిప్రాయం, విద్యుత్ కలెక్షను, బకాయిలపై సబ్ స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఆర్డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని, జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేయడం కోసం ప్రతి ఒక్క విద్యుత్ అధికారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందరికీ అందించాలని, దానికోసం ఫీడర్ పెట్రోలింగ్ చేసి లోపాలను సరి చేయాలని తద్వారా ప్రజలకు విద్యుత్ శాఖపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ప్రజలకు స్మార్ట్ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ ఆవశ్యకతను తెలియజేస్తూ మారుతున్న సమాజంలో స్మార్ట్ మీటర్‌తో కలిగే ఉపయోగాలు వివరించాలని సూచించారు. సమావేశంలో ఏపీ సీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
పీఎం సూర్య ఘర్ పురోగతి పెరగాలి
విద్యుత్ బకాయీల విషయంలో నిర్లక్ష్యం వీడాలి
విద్యుత్ శాఖ అధికారుల సమీక్షలో సీఎండీ పుల్లారెడ్డి