
రామరాజ్యం జగన్‌తోనే సాధ్యం
మర్రిపూడి: రామరాజ్యం కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మర్రిపూడి పడమటి బజారులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథిగా హాజరయ్యాఉ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని, అధికారులు సైతం పాలకులకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా సూపర్–6 పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అందిస్తామని చెప్పి చివరకు తల్లులను మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులైన వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తానని ఏడాదిగా మహిళలను మభ్యపెడుతూ వస్తున్నారని, అన్నదాత సుఖీభవ పథకాన్ని గత ఏడాది ఎగ్గొట్టి రైతులును నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకుండా విద్యార్థులను అన్యాయం చేశారని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో గృహిణులకు మొండి చేయిచూపారని నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే బెదిరింపులకు పాల్పడుతూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పచ్చ నేతలు మద్యం బెల్డ్ దుకాణాలు, అక్రమ రేషన్ దందా, ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిస్తున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రి సైతం కమీషన్ దండుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ ఆక్రమణలు, నిధుల దోపిడీని కట్టడి చేయకపోగా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టించడమంటే ఏడాది వ్యవధిలో రూ.1.70 లక్షల కోట్లు అప్పు చేయడమేనా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాటాన్ని ఆపబోమన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలు కొనసాగాలంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మాకినేని సుధారాణి వెంకట్రావు, నియోజకవర్గ రైతు విభాగం, ఎంప్లాయర్స్, పెన్షనర్ విభాగం అధ్యక్షులు బొల్లినేని నాగేశ్వరరావు, పెట్లూరి కృష్ణమూర్తి, సర్పంచ్ కదిరి భాస్కర్, వైస్ ఎంపీపీ ఎస్‌కే నాసర్, ఇనుకొల్లు మాదిరెడ్డి, ఇనుకొల్లు జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలనూ చంద్రబాబు వంచించారు
అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అరాచకం సృష్టిస్తున్నారు
ఏడాదిలోనే రూ.1.70 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం అధోగతిపాలు
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం