గుండె తరుక్కుపోయేలా.. కళ్లు చెమర్చేలా గిరిజన చిన్నారుల పరిస్థితి
‘వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు
రాకుండా చూడాలి. వారికి అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలి’
ఇవీ గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు..
‘ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు
ఏఎన్‌ఎంలను నియమిస్తాం’ ఇదీ గత ఏడాది నవంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన ప్రకటన..
ఇవేవీ వాస్తవ రూపం దాల్చలేదు సరికదా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలు
రెట్టింపయ్యాయి. బుక్కెడు కూటికి, గుక్కెడు
మంచినీటికి మొహం వాచిపోయిన గిరిజన చిన్నారుల పరిస్థితి చూస్తే ఎవరికై నా గుండె
తరుక్కుపోవాల్సిందే.
యర్రగొండపాలెం:
జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఎక్కడ అంటు వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు కాక గిరిజన బాలలు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితి. జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో సుమారు రెండు వేల మంది చిన్నారులు చదువుకుంటున్నారు. పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్ల, గారపెంట, యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల, అల్లిపాలెం, దద్దనాల(శాంతినగర్), అల్లిపాలెం(హనుమంతుని గూడెం), బిల్లగొందిపెంట, దోర్నాల మండలంలోని తుమ్మలబైలు, చింతల, మర్రిపాలెం, బీఎంసీ కాలనీ, చిలకచెర్ల, పెద్దమంతనాల, పెద్దారవీడు మండలంలోని చింతలముడిపి, అర్ధవీడు మండలంలోని భీమరాయునిచెరువు గూడెంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో అరకొర వసతులతోపాటు పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 1963లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటికీ ఆశ్రమ పాఠశాలల నిర్వహణ కొనసాగుతుండటం గిరిజనులపై పాలకుల సవతి ప్రేమను తేటతెల్లం చేస్తోంది. నాటి జోవో ప్రకారం 30 మంది విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలలో నలుగురు వర్కర్లు సేవలు అందించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో 240 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కూడా ఇద్దరు లేదంటే ముగ్గురు వర్కర్లు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం.
పుల్లలచెరువు మండలం మురికిమళ్ల ఆశ్రమ పాఠశాలలో అమలు కాని మెనూ
అపరిశుభ్రంగా క్యాంపస్.. వర్కర్స్ లేక పనులన్నీ విద్యార్థులతోనే..
162 మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది 8 మంది టీచర్లే..
13 మంది టీచర్ల కొరతతో బోధన సక్రమంగా లేదని తల్లిదండ్రుల ఆవేదన
అర్ధాకలి.. అగచాట్లు!