
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
ఒంగోలు సిటీ : ఒంగోలు మండలంలోని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల దుకాణాలను గురువారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. మంగళగిరి ఏడీఏటీ శ్రీనివాసరావు, నెల్లూరు విజిలెన్స్ సీఐ ఎస్‌కే సుభాని తనిఖీలు చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకపోవడంతో బాలాజీ ఏజెన్సీలో రూ. 54 లక్షల విలువైన పురుగుమందులు, శాంతి సీడ్స్‌లో రూ.2.80 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారు. తనిఖీల్లో ఒంగోలు మండల వ్యవసాయాధికారి కె.రమేష్‌బాబు, టెక్నికల్ ఏఓ పి.వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.
లారీ బోల్తా..
● ముగ్గురికి గాయాలు
కొమరోలు: ఎదురుగా వస్తున్న మహిళను తప్పించబోయి లారీ బోల్తాపడింది. ఈ సంఘటన మండలంలోని నల్లగుంట్ల గ్రామ సమీపంలోని క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన రామారావు, రమేష్, సల్మాన్‌రాజు ఎద్దుల జతను లారీలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు తీసుకువెళుతుండగా నల్లగుంట్ల గ్రామానికి చెందిన మహిళ అడ్డురావడంతో లారీ అదుపుతప్పి రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా సల్మాన్‌రాజు, రామారావుకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు.
జీతం ఇవ్వలేదని పెట్రోల్
పోసుకోని ఆత్మహత్యాయత్నం
చీమకుర్తి రూరల్: జీతం ఇవ్వడం లేదని పెట్రోల్ పోసుకోని నిప్పంటించుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మండలంలోని హంస క్వారీలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..క్వారీలో బస్సు డ్రైవర్‌గా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పని చేస్తున్నాడు. క్వారీ యాజమన్యం కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కార్మికులంతా మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం పెట్రోల్ పెసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించగా..అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు.
ఆస్తి వివాదంలో
పిన్ని, పినతండ్రిపై దాడి
గిద్దలూరు రూరల్: ఆస్తి విషయంలో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి పిన్ని, పినతండ్రిని అంతమొందించేందుకు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలోని పొదలకుంటపల్లె గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శనివారపు రమణారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమణారెడ్డి అన్న కుమారుడు నిరంజన్‌రెడ్డి ఇనుప రాడ్‌తో వారి తలపై బలంగా మోదాడు. తలకు తీవ్రగాయలపాలైన వారి కేకలకు స్థానికులు నిద్రలేచే సరికి నిరంజన్‌రెడ్డి అక్కడ నుంచి పారిపోయాడు. గాయపడిన దంపతులను స్థానికులు 108 అంబులెన్స్‌లో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. బాధితుల కుమారుడు సాయికుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.సురేష్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు