నమ్మించి మోసగించడమే బాబు నైజం | - | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసగించడమే బాబు నైజం

Jul 19 2025 1:07 PM | Updated on Jul 19 2025 1:07 PM

నమ్మి

నమ్మించి మోసగించడమే బాబు నైజం

దర్శి: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నమ్మించి మోసం చేయడం బాబు నైజమని, ఇచ్చిన మాటకు కట్టుబడి 100 శాతం హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైజమని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దర్శి పట్టణంలోని బూచేపల్లి నివాసంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అర్హులందరికీ అన్నీ పథకాలు అందిస్తే...ఈవీఎంల ద్వారా సీఎం అయి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత దుర్మార్గపు ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌లను చూస్తే ఆరోగ్య శ్రీ, డ్యాంలు, అమ్మఒడి, నాడు–నేడు, కార్పొరేట్‌ విద్య, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చిహ్నలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబును చూస్తే వెన్నుపోటు, నయవంచన, ప్రజలకు హామీలిచ్చి మోసం చేసిన మోసగాడుగా గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రంలో స్కీంలు ఒక్కటీ అమలు కావడం లేదుకానీ స్కాంలు మాత్రం భారీగా జరుగుతున్నాయన్నారు.

మహిళలకు మొండిచేయి

రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పథకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు. దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్తే ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. పిఠాపురం పీఠాధిపతి పవన్‌ తన సొంత జిల్లాలో మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడరు కానీ పక్క రాష్ట్రాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తా, నారతీస్తా అంటారని అన్నారు. సకల శాఖా మంత్రి లోకేష్‌ జగన్న పథకాలు అన్నీ తానే సృష్టించానని ప్రచారం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రి బొద్దింక అని చెప్పి తెల్లవారు జామున వెంట్రుక అని చెప్పే మహిళా హోంమంత్రి కూటమి పాలనలో ప్రతి గంటకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడలేదని మండిపడ్డారు.

జీవితాంతం జగనన్నతోనే పయనం

జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తమ జీవితాంతం వైఎస్‌ జగనన్నతోనే పయనిస్తామని, నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పొదిలి పర్యటనలో టీడీపీ వాళ్లు తప్పులు చేస్తే దాచి పెట్టి అమాయకులను జైల్లో పెట్టారన్నారు. సెంటర్లో బ్యానర్లు వేస్తామంటే అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌ పై దాడి చేస్తే మహిళా హోం మంత్రి అయి బాధితురాలిపైనే కేసులు పెట్టించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, అంతకు రెండు రెట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ మార్కాపురంలో నిర్వహించిన సభలో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వంలో ఉంటామని చెప్పడమే జగనన్న అంటే వాళ్లకు పట్టుకున్న భయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమికి దడపట్టుకుందని చెప్పారు. మద్యం, ఇసుక, గ్రావెల్‌, రేషన్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జెండాలు, ఫ్లెక్సీలు కట్టనీయడం లేదని కనీసం కార్యక్రమాలకు కళ్యాణ మండపాలు కూడా ఇవ్వకుండా ఆపితే కార్యక్రమాలు ఆగిపోవని, అంతకు రెట్టింపు ఉత్సాహంతో భారీగా కార్యకర్తలు హాజరయ్యారన్నారు. క్యూఆర్‌ కోడ్‌ను ప్రతి ఇంటికి చేర్చి చంద్రబాబు ఇచ్చిన హామీలు– చేసిన మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతుల కోసం వచ్చిన జగనన్నను కలవడానికి వస్తే 40 మంది పై కేసులు పెట్టారన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని స్పష్టం చేశారు.

ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్న హయాంలో ఆయన పేరు చెప్పి సంపాదించుకుని, అధికారంలో లేనప్పుడు ఒకరు పార్టీని వదిలి వెళ్తే.. జిల్లాను మరింత బలోపేతం చేసే మంచి నాయకుడుగా బూచేపల్లిని జగనన్న ఎంపిక చేశారన్నారు. చంద్రబాబు మోసాల గురించి చెప్పాలన్నా... రాజన్న, జగనన్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలన్నా ఒకరోజు సరిపోదని ఎద్దేవా చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకుడు కేవీ రమణారెడ్డి, ఎంపీపీలు బొడిచర్ల ఉషామురళి, సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, యూత్‌ జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్‌, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయభాస్కర్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పోశం మధుసూదన్‌రెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు ఆవుల జ్యోతి, మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబురావు, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

హామీల అమలులో కూటమి విఫలం క్యూఆర్‌ కోడ్‌ ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి మాట తప్పిన నాయకులు వస్తే నిలదీయండి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీలో వైఎస్సార్‌ సీపీ నేతలు కారుమూరి, బూచేపల్లి, శ్యామల, బత్తుల

నమ్మించి మోసగించడమే బాబు నైజం1
1/1

నమ్మించి మోసగించడమే బాబు నైజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement