
పేదరికాన్ని రూపుమాపటమే లక్ష్యం
● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
ఒంగోలు సబర్బన్: పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పి–4 విధానాన్ని రూపొందించిందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ఆర్ గోపాల కృష్ణతో కలసి మండల స్థాయి అధికారులతో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా అర్హులైన బంగారు కుటుంబాలను, మార్గదర్శకులను గుర్తించాలని జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. జిల్లాలో 74 వేల 911 బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వీరికి కావాల్సిన అవసరాలను గుర్తించడంతోపాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకులను కూడా ఈ నెల 25వ తేదీ లోపు గ్రామ, వార్డు సభలు నిర్వహించి గుర్తించాలన్నారు. సచివాలయం వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఈనెల 19న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, హౌసింగ్ పీడీలు జోసెఫ్ కుమార్, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, డీటీసీ సుశీల, డీసీఓ పద్మశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.