
వీఏఏల బదిలీలపై హైకోర్టు స్టే
బేస్తవారిపేట: విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల్లో అన్యాయం జరిగిందని హైకోర్టుకు ఏడుగురు వీఏఏలు వెళ్లారు. స్పౌజ్ కోటా, వికలాంగులు, సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని, సీనియారిటీ ఉన్న వీఏఏలు ఎంచుకున్న ప్రదేశాల్లో జూనియర్‌లను నియమించడం, రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏకపక్షంగా ఎంచుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం చట్ట విరుద్ధంగా జరిగిందని కోర్టుకెళ్లారు. చోళ్లవీడు ఆర్‌ఎస్‌కే వీఏఏ సుమంత్‌బాబు, సలకలవీడు టీ రమణారెడ్డి, గుడిపాటిపల్లి దుర్గం జిలానీ, రాజుపాలెం కేవీ ధనూషా శ్రీ, కంభం టీ చెన్నారెడ్డి, ఎంపీ చెరువు ఎం బాలకృష్ణ, పెద్ద ఓబినేనిపల్లె ఏ శ్రీనివాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈనెల 23వ తేదీ వరకు కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.
విద్యుత్ సరఫరా లేక జీజీహెచ్‌లో రోగుల అవస్థలు
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్‌లో శుక్రవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం అర్ధరాత్రి నుంచి మార్కాపురం ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో జీజీహెచ్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఫ్యాన్లు, లైట్లు లేక చీకట్లో ఇబ్బందులు పడ్డారు. ఆపరేషన్ చేయించుకున్నవారు తీవ్రమైన ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. జీజీహెచ్‌లో జనరేటర్ సౌకర్యం ఉన్నా వేయలేదని పలువురు రోగులు తెలిపారు. సాయంత్రం సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
21న మీటర్ రీడర్స్ చలో విజయవాడ
కంభం: మీటర్ రీడర్స్ డిమాండ్‌ల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 21న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం చలోవిజయవాడ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్ రీడర్స్ అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి అందరూ తరలిరావలని కోరారు. మీటర్ రీడర్స్ కాశిరెడ్డి, పిట్టల శ్రీను, రామక్రిష్ణ, నారాయణ, నాసర్ పాల్గొన్నారు.
పడిపోతున్న పొగాకు సరాసరి ధరలు
టంగుటూరు: పొగాకు సరాసరి ధరలు రోజు రోజుకీ అమాంతం పడిపోతున్నాయి. గత సంవత్సరం 40 నుంచి 50 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొనేవి. ఇప్పుడు కేవలం 20 కంపెనీలే పాల్గొంటున్నాయి. అందులో కూడా చాలా కంపెనీలు మొక్కుబడిగా పాల్గొంటున్నాయని రైతులు అంటున్నారు. వేలం ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నా బోర్డు ఉన్నతాధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసర ధర రూ.197.87 పలికింది. వేలం కేంద్రానికి కారుమంచి గ్రామానికి చెందిన రైతులు వేలానికి 957 బేళ్లను తీసుకురాగా వాటిలో 798 బేళ్లు కొనుగోలు చేశారు. 159 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.160, సరాసరి రూ.197.87 ధర పలికింది. ఈ వేలంలో మొత్తం 25 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
ఆగని తిరస్కరణ పొగాకు బేళ్లు
కొండపి: రోజు రోజుకీ తిరస్కరణ బేళ్లు పెరుగుతున్నా అటు ప్రభుత్వం, ఇటు బోర్డు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బోర్డు అధికారులు ఆర్డర్లు వచ్చాయి ఏ రకం పొగాకునైనా కొనుగోలు చేస్తామని చెబుతున్నా అది ఆచరించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరస్కరణ బేళ్లు వేలం కేంద్రం నుంచి ఇంటికి తీసుకొని పోయి మళ్లీ కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేలుకు వందల్లో ఖర్చవుతుందని రైతులు వాపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శుక్రవారం నెన్నూరుపాడు, మూగచింతల, గుర్రపడియ, సతుకుపాడు, కె.అగ్రహారం గ్రామాలకి చెందిన రైతులు 1223 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 822 కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 401 తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160, సరాసరి రూ.223.64 ధర పలికింది.

వీఏఏల బదిలీలపై హైకోర్టు స్టే