
సౌండ్ పెంచితే సహించం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరిక
ఒంగోలు టౌన్: మాడిఫైడ్ సైలెన్సర్లతో విపరీతమైన శబ్దాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తీవ్రంగా హెచ్చరించారు. గత 6 నెలల కాలంలో ఒంగోలు నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 550 మాడిఫైడ్ సైలెన్సర్లను శుక్రవారం మంగమూరు రోడ్డులోని రత్నదీప్ స్టోర్స్ సెంటర్లో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. కార్యక్రమాన్ని ఎస్పీ దగ్గురుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ఆకతాయిలు ఉద్దేశ పూర్వకంగానే కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో అధిక శబ్దం చేసుకుంటూ తిరుగుతున్నట్లు తమ దృష్టికి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. మాడిఫైడ్ సైలెన్సర్ల వలన అధిక శబ్దాలు వస్తాయని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. మోడిఫైడ్ సైలెన్సర్లను వాడడం మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, చట్టప్రకారం ఇది నేరమన్నారు. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసరావు, శివప్రసాద్ పాల్గొన్నారు.