
నకిలీ ధ్రువీకరణ పత్రాల కేసులో నలుగురు అరెస్టు
జరుగుమల్లి(సింగరాయకొండ): తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, నకిలీ రిబ్బరు స్టాంపులు తయారు చేసి ప్రభుత్వం స్థలం కాజేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. కేసులో నిందితులైన ఎన్‌ఎన్ కండ్రిక గ్రామానికి చెందిన చింతగుంట్ల అంకయ్య, పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన గౌడపేరు రవికుమార్, వలేటివారిపాలెం మండలం కూనిపాలెం గ్రామానికి చెందిన యెండ్లూరి ఇమ్మానియేల్, శాఖవరం గ్రామానికి చెందిన తాటిపర్తి అశోక్‌లను అరెస్టు చేశామన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై వివరాలు వెల్లడించారు. ఎన్‌ఎన్ కండ్రిక గ్రామంలో 1997లో ప్రభుత్వం ఆ గ్రామానికి చెందిన మల్లయ్య, సుందరరామయ్యలకు చెందిన 1.92 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో 5 సెంట్ల చొప్పున ప్లాట్లు వేసి 24 మంది మాదిగలకు ఇళ్లు కట్టించి ఉచితంగా ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని సామాజిక అవసరాలకు ఉంచారు. గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు చింతగుంట్ల రోశయ్యకు ఎటువంటి స్థలం ఇవ్వలేదు. అయితే రోశయ్య గ్రామ అవసరాలకు ఉంచిన స్థలాన్ని కాజేసే ప్రయత్నంలో తన అన్న కొడుకు అంకయ్యతో కలిసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించాలని నిర్ణయించి ఇందుకోసం పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన రవికుమార్‌తో తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసేందుకు రూ.23 వేలు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. తరువాత రవికుమార్, ఇమ్మానియేల్, అశోక్ ముగ్గురు కలిసి సర్వేనంబరు 97 లోని 286 గజాల స్థలం 15 ఏళ్లుగా రోశయ్య అనుభవంలో ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తరువాత ఆ స్థలాన్ని రోశయ్య భార్య కోటమ్మ పేరుపై కందుకూరు రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్థల విషయమై మాదిగ కులస్తులు ఒంగోలు మీకోసంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహేంద్ర కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రిజిస్ట్రేషన్ కాగితాలు, రెండు రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.