ముక్కలు చెక్కలు
సంక్షేమం
రేషనలైజేషన్ పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం రెవెన్యూ శాఖను ఓ కుదుపు కుదిపింది. సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా విభజస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషనలైజేషన్ తర్వాత మిగులుగా ఉన్నవారిని ఎక్కడ, ఎలా వినియోగిస్తారనే స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుండగా, సేవలు సక్రమంగా అందవేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు.
కంభం: రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వీఆర్వోలు ఆందోళనకు గురవుతున్నారు. సచివాలయాలను క్లస్టర్లుగా విభజించడంతోపాటు సిబ్బందిని రేషనలైజేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన జీవో నంబర్ 4 విడుదల చేసింది. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన రెండు లేదా మూడు గ్రామ/వార్డు సచివాలయాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను సైతం కుదిస్తున్నారు. ఈ విధానంపై రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక సచివాలయలో ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ పనిచేస్తుండగా నూతన విధానంలో మాత్రం ఆ క్లస్టర్‌లోని ఒక సచివాలయంలో వీఆర్వో, మరోదానిలో సర్వేయర్ ఉంటారు. ఈ లెక్కన జిల్లాలో 353 మంది వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపుతున్నారు. మిగులు సిబ్బందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా సతమతమవుతున్నారు. గతంలో ఏఆర్‌ఐ పోస్టులను తొలగించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కేటాయించిన నేపథ్యలో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రస్తుతం వీఆర్వోలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో మండలంలోని సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగులు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు.
పదోన్నతి కోసం ఎదురుచూపులు
వీఆర్వోలను పాత విధానంలోనే కొనసాగించాలని వీఆర్వోలు కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వీఆర్వోలు ప్రమోషన్ పొందేందుకు అర్హులైన వారు సర్కారు నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగి శాఖాపరమైన పరీక్షలు, సర్వే శిక్షణ, సీపీటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ సీనియారిటీ ప్రకారం ఏక కాలంలో సీనియర్ అసిస్టెంట్ లేదా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్నది వీఆర్వోల డిమాండ్. ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ వేతనం పొందుతున్న సీనియర్ వీఆర్వోలకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న వీఆర్వోలకు రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు.
రెవెన్యూ వ్యవస్థ రెక్కలు విరిచేలా కూటమి ప్రభుత్వం అడుగులు సచివాలయాలను క్లస్టర్లుగా విభజిస్తూ జీవో నంబర్ 4 విడుదల ప్రస్తుతం ఒక్కో సచివాలయానికి ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ కొత్త జీవో ప్రకారం రెండు సచివాలయాలకు కలిపి ఒక్కరే వీఆర్వో జిల్లాలో మిగులు ఉద్యోగులుగా 285 వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లు పని భారం పెంచొద్దని, అర్హులకు ప్రమోషన్ ఇచ్చి రేషనలైజ్ చేయాలని డిమాండ్


