డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి

Apr 30 2025 12:23 AM | Updated on Apr 30 2025 12:23 AM

డ్రగ్

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి

ఒంగోలు సిటీ: డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆంధ్రకేసరి యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి. రాజమోహన్‌ రావు అన్నారు. స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన డ్రగ్స్‌ నియంత్రణ అవగాహనా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మండే హర్ష ప్రీతం దేవ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాజమోహన్‌ రావు మాట్లాడుతూ సమాజాన్ని అంటురోగం మాదిరిగా పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారి, డ్రగ్స్‌ వినియోగం, గంజాయి, సిగిరెట్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను యువతీ యువకులైన విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే సమయంలో వాటిని వినియోగించడం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మండే హర్ష ప్రీతం దేవ్‌ కుమార్‌ మాట్లాడుతూ నేటి యువత నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఇందులో భాగంగా డ్రగ్స్‌ వినియోగాన్ని సమాజానికి దూరం చేసేందుకు నాంది పలకాలన్నారు. విద్యార్థులు తొలుత తమ స్వగ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. యూనివర్శిటీ నుంచి నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏకేయూ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

ఫ్లోరైడ్‌ సమస్యకు చరమగీతం

20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్‌ లంకా దినకర్‌

ఒంగోలు సబర్బన్‌: ఫ్లోరైడ్‌ సమస్యకు చరమగీతం పాడితేనే వికసిత భారత్‌లో ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మెన్‌ లంకా దినకర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తొలుత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా తాగునీరు, ఫ్లోరైడ్‌ సమస్య, యర్రగొండపాలెం ఏస్పిరేషన్‌ బ్లాక్‌లో కేంద్ర పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించామన్నారు. జిల్లాలో ఒక వైపు తాగు, సాగు నీరు ఇబ్బందులుంటే, పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఫ్లోరిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 729 పంచాయతీల్లోని 1,769 గ్రామాల్లో 1009 గ్రామాలు ఫ్లోరైడ్‌ సమస్యతో ఉన్నాయని, ప్రస్తుతం ఫ్లోరైడ్‌ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం 27 గ్రామాల్లో సురక్షిత తాగు నీటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కనిగిరి పరిధిలో ఎక్కువగా 339, దర్శి పరిధిలో 120, మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో 52 గ్రామాల్లో , కొండపిలో, ఎస్‌ఎన్‌పాడులో 25, ఒంగోలు మండలంలోని ఒక గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య ఉందన్నారు. డయాలసిస్‌ సెంటర్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు ద్వారా జిల్లాలో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి సీఎస్‌ఆర్‌ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. 16 వ ఆర్ధిక సంఘం ప్రతినిధులకు ఫ్లోరైడ్‌ సమస్య ఉన్న ప్రాంతాలకు అదనపు గ్రాంట్‌ ఇవ్వాలని కోరామన్నారు. కనిగిరి నియోజకవర్గం, కొండపిలోని మర్రిపూడి మండలంలో పూర్తి స్థాయిలో సురక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కనిగిరిలో ఒక డయాలసిస్‌ సెంటర్‌లో నెలకు 120 మందికి సేవలు అందిస్తున్నారని, ఇంకా ఎన్ని అవసరమో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జిల్లాకు 1305 యూనిట్లు మంజూరు

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌నాయక్‌

మార్కాపురం: ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో జిల్లాకు 1305 యూనిట్లు మంజూరైనట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అర్జున్‌ నాయక్‌ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న 38 మండలాలు, 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు కలిపి వీటిని మంజూరు చేశామన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లబ్ధిదారులు యూనిట్లు పొందిన తరువాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈయన వెంట ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు.

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి1
1/2

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి2
2/2

డ్రగ్స్‌ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం నింపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement