మత్తు.. భవిత చిత్తు!
నగరంలో ఎటు చూసినా గంజాయే
గంజాయిపై ఉక్కుపాదం..
పట్టణాల్లో గంజాయి సేవిస్తున్న వారిపై నిఘా ఉంచాం. వారి ద్వారా సరఫరాదారుల వివరాలు సేకరిస్తున్నాం. గంజాయికి సంబంధించి పాత కేసులు ఉన్న వారిని పిలిపించి వివరాలు సేకరిస్తున్నాం. డాగ్ స్క్వాడ్‌లతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయికి బానిసలు కావొద్దు..జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం భాగస్వాములను చేస్తున్నాం.
– ఏఆర్ దామోదర్, ఎస్పీ
ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టుతో కలకలం..
ఇటీవల టంగుటూరు పరిధిలో గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. వల్లూరు సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థి వైజాగ్ నుంచి 5 కిలోల గంజాయి తీసుకొచ్చి హాస్టల్‌లో ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపించారు.
జిల్లాను గంజాయి మత్తు కమ్మేస్తోంది. పట్టణం..పల్లె అనే తేడా లేకుండా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిల్లర కొట్లు..కాలేజీల పరిసరాల్లో సులువుగా లభ్యమవుతోంది. జిల్లా కేంద్రం మొదలు పశ్చిమ ప్రకాశం అంతటా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, బీఈడీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్ కళాశాల విద్యార్థులే టార్కెట్‌గా దీనిని విక్రయిస్తున్నట్టు సమాచారం. పోలీసులు దాడులు చేస్తున్నా విక్రయాలు మాత్రం ఆగడంలేదు. కొంతమంది పోలీసులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టౌన్: గంజాయి అమ్మకాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. గతంలో పట్టణాల్లో మాత్రమే దొరికే గంజాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గంజాయి దొరకని మండల కేంద్రం లేదు. యువకులు గంజాయికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గంజాయికి బానిసలైన యువకులు చేతిలో డబ్బులు లేక దొంగతనాలకు వెనుకాడడం లేదు. జైలుపాలై కన్నవారికి కడగండ్లు మిగిల్చుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాల పరిధిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ మార్కాపురంలోని ఎస్టేట్ ఏరియాలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల వ్యవధిలో ఒడిశాకు చెందిన అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేశారు. రైల్వే బ్రిడ్జి కింద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరు పట్టణంలో తెలంగాణ నుంచి వచ్చి విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శి పట్టణంలోని చౌడవరం రోడ్డుతో పాటుగా తూర్పు గంగవరం, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండలాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. దొనకొండలో రైలు మార్గంగుండా గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలంలో ఊరి బయట ఉన్న ఒక సినిమా హాలు పరిసరాల్లో, తిరుమల నగరి కాలనీతో పాటుగా కొలుకుల, వీరభద్రాపురం, త్రిపురాంతకం మండంలంలోని నడిగడ్డ తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. 6 నెలల క్రితం యర్రగొండపాలెంలో గంజాయి కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. గతంలో కూడా ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పేరుతో యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల పోలీసు స్టేషన్లకు తిప్పినట్లు తెలుస్తోంది. ఎక్కువగా 15 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు గంజాయి బారిన పడుతుండటంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి మత్తులో రోడ్డు ప్రమాదాలు:
ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గంజాయి ప్రభావం కనిపిస్తోంది. అనేక మంది యువకులు గంజాయి తాగిన మత్తులో వేగంగా వాహనాలు నడపడం, ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైపోయింది. అర్ధరాత్రిళ్లు రోడ్డు మీదకు వచ్చి వేగంగా వాహనాలు నడుపుతూ అదుపుతప్పి పడిపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులకు కన్నీరు మిగుల్చుతున్నారు. కనిగిరి మండలంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి.
బీచుల్లో జోరుగా విక్రయాలు
జిల్లాలో కొత్తపట్నం, పాకల, కరేడు, ఈతముక్కలలో బీచ్లు, మల్లవరం డ్యామ్ ఉన్నాయి. శని, ఆదివారాలు వస్తే చాలు జిల్లాలో ఉన్న బీచుల్లో యువత సందడి కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే బీచ్‌లకు వచ్చే యువతీ యువకులను టార్గెట్ చేసుకొని కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మైరెన్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నారు.
రాత్రి ప్రయాణాల్లో గంజాయి గొడవ...
జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి చుట్టు పక్కల గ్రామాలకు, పట్టణాలకు రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఒంగోలు సమీప గ్రామాలకు నైట్ హాల్ట్ బస్సులు వెళుతుంటాయి. వినుకొండ, నరసరావుపేట, అద్దంకి, నెల్లూరు నుంచి కూడా నైట్ హాల్ట్ బస్సులు ఒంగోలుకు వస్తుంటాయి. ఇక ఒంగోలు మీదుగా రోజుకు వందకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. బస్సులు, రైళ్లలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాత్రి పూట ప్రయాణాల్లో గంజాయి, మద్యం తాగిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కోసారి ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మార్కాపురం నుంచి ఒంగోలు వస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ బస్సులో ఎక్కిన వ్యక్తి గంజాయి మత్తులో ఒక మహిళ పక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు ఇంజినీరింగ్, మెడికల్, ఇంటర్ విద్యార్థుల టార్గెట్‌గా అమ్మకాలు పశ్చిమ ప్రకాశంలో గంజాయి జోరు సెలవు రోజుల్లో బీచుల్లో విక్రయం కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టామంటున్న ఎస్పీ దామోదర్
జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఎటు చూసినా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నగర శివారులోని ఇంజినీరింగ్ కాలేజీల పరిసరాల్లో జోరుగా గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. టంగుటూరు మండలం ఒంగోలు శివారు ప్రాంతంలోని ఒక దేవాలయం సమీపంలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలోని రెండు బిల్డింగులను అడ్డాగా చేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా, ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పలు లాడ్జీల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ డిపో లోపలకు వెళ్లే దారిలో మొదటి ప్లాట్ ఫాం వైపు ఉన్న షాపుల్లో కూడా గంజాయి లభ్యమౌతున్నట్లు సమాచారం. చింతల, కొప్పోలు టిడ్కో గృహాల ఎదురుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వదిలేశారు. అక్కడ ఖాళీ స్థలంలో గంజాయి తాగడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. కమ్మపాలెం ఫ్లై ఓవర్ కింద దశరాజుపల్లికి వెళ్లే దారిలో, అగ్రహారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ పక్కన, ఎఫ్‌సీఐ గోడౌన్ పరిసరాల్లో, రైలు పేట మొదటి లైనులోని ఒక బీడీ బంకులో, క్లౌవ్ పేట, గోపాల్ నగర్ 4వ లైను ఖాళీ స్థలాల్లో, గోపికృష్ణ థియేటర్ సమీపంలో గంజాయి అమ్మకాలు, సేవించడం జరుగుతున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్ పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.
మత్తు.. భవిత చిత్తు!


