
ఐస్ యాపిల్
తింటే సల్లగుంటది!
ఉపయోగాలివే..
● తాటి ముంజలకు క్యాన్సర్ల నుంచి రక్షించే గుణం ఉందని వైద్యుల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇవి కొన్నిరకాల ట్యూమర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయని చెబుతున్నారు.
● లివర్, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంతోపాటు గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపకరిస్తాయి.
● వేసవిలో శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యం చేసి తక్షణ శక్తిని ఇచ్చేందుకు ముంజలు దోహదపడతాయి.
● తాటి ముంజల్లో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది.
● 100 గ్రాముల ముంజల్లో 43 కేలరీలు ఉంటాయి.
● బరువును అదుపులో ఉంచడంలో, ముఖంపై మొటిమలు తగ్గించడంలో మేలు చేస్తాయి.
వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణి కార్తె కూడా సమీపిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వేడిని తట్టుకుని శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. శీతల పానీయాలు ఎన్ని తాగినా దాహార్తి తీరదు.! అందుకే ముంజలు ఆరగించేయాలి. పుచ్చకాయ, కర్బూజలో నీటి శాతం, ప్రొటీన్లు ఉన్నప్పటికీ మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలే. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తాటి ముంజలతో బోలెడు లాభాలు ఉన్నాయి. శ్రీఐస్ యాపిల్స్‌శ్రీగా పేరొందిన తాటి ముంజల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్‌తోపాటు ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉండే తాటి ముంజలను తినడం ద్వారా వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు. గ్రామాల్లో విరివిగా దొరికే తాటి ముంజలకు సీటీల్లోనూ భారీగా గిరాకీ పెరిగింది.
● జిల్లాలో జోరుగా సాగుతున్న ముంజల వ్యాపారం
● పల్లెలతోపాటు పట్టణాల్లోనూ గిరాకీ
● జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ముంజలు ఎగుమతి
● ముంజల సేకరణతో ఉపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు
● వేసవి సీజన్‌లో నెలకు రూ.60 వేల వరకు ఆదాయం
కొనకనమిట్ల: తాటి ముంజల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. వేసవి తాపాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపకరిస్తున్న ముంజలు లొట్టలేసుకుంటూ ఆరగించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ముంజలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి కాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల సేకరణలో ఎంతో శ్రమ ఉంటుంది. వందల కుటుంబాలు ముంజల సేకరణ, విక్రయం ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ముంజలు సేకరించిన తర్వాత వినియోగదారులకు నేరుగా విక్రయించడంతోపాటు హోల్‌సెల్ వ్యాపారం కూడా చేస్తున్నారు.
చెట్టు నుంచి తాటి గెలలు కోస్తూ..
జోరుగా వ్యాపారం
కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, నాయుడుపేట, చినమనగుండం, వింజవర్తిపాడు, దాసరపల్లి, సలనూతల, మర్రిపాలెం తదితర గ్రామాలతోపాటు హనుమంతునిపాడు, కొత్తపట్నం, జె.పంగులూరు మండలాల్లో కూడా విస్తారంగా తాటి తోపులు ఉన్నాయి. వందలాది కుటుంబాలు తెల్లవారుజామునే పొలాలకు వెళ్లి తాటికాయలు సేకరించి, ముంజలు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి కుటుంబం తాటి ముంజలు సేకరించి విక్రయిస్తుండటం విశేషం. ఈ గ్రామంలో పదేళ్ల పిల్లలు కూడా అవలీలగా తాటి చెట్లు ఎక్కి కాయలు దించడంలో హుషారుగా ఉంటారు. మూడు నెలలుపాటు జరిగే వ్యాపారంలో ఒక్కో కుటుంబం రూ.60 వేల వరకు సంపాదిస్తోంది. అంతేగాకుండా కర్నూలు, నంద్యాల, మార్కాపురం, ఒంగోలు, పోరుమామిళ్ల, కొమరోలు, ఆత్మకూరు, గిద్దలూరు, దొనకొండ ప్రాంతాలకు చెందిన కొందరు ఇక్కడ హోల్‌సెల్‌గా ముంజలు కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
కష్టంతో కూడుకున్న పని
తాటి ముంజల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే మాకు అలవాటైన పని కావడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటంతో ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాం. వేసవి కాలంలో ముంజల సేకరణతో చేతి నిండా పని దొరుకుతోంది. – పి.సుబ్బయ్య, బ్రాహ్మణపల్లి
ముంజలు ఆరోగ్యానికి మేలు
సీజనల్‌గా లభించే తాటి ముంజలు తినడం ఆరోగ్యానికి మంచిది. తాటి పండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వేసవిలో శరీరానికి కలిగే అలసత్వాన్ని ముంజలు తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు జింక్ ఫాస్పరస్, ఖనిజ లవనాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తాటి ముంజల పైన ఉండే తొక్క తీయకుండా తింటే శరీరానికి చాలా మంచిది. – డాక్టర్ ఎస్పీ.బాలయ్య, కొనకనమిట్ల
గొట్లగట్టు బస్టాండ్‌లో ముంజల వ్యాపారం

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్

ఐస్ యాపిల్