‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’ | YSRCP Shyamala Slams TDP Mahanadu, Challenges Nara Lokesh To Public Debate On Women’s Welfare And Governance | Sakshi
Sakshi News home page

‘టీడీపీ మహానాడు ఓ మహానాటకం’

May 29 2026 3:13 PM | Updated on May 29 2026 5:47 PM

Ysrcp Shyamala Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.

ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, వైఎస్‌ జగన్‌ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో ఆమె ఇంకేమన్నారంటే..

మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీ
మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు  ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.

రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్‌ జగన్‌ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనే
ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్‌లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్‌ జగన్‌.

మహిళలకు రిజర్వేషన్‌పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఎలాగో పార్లమెంట్‌లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.

హత్యా రాజకీయాలు టీడీపీవే
గొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్‌ జగన్‌ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ  రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్‌ జగన్‌ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.

మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.

నువ్విచ్చేది ఏంటి బోడి... మహిళా రిజర్వేషన్లపై లోకేష్ కామెడీ కామెంట్స్

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?

మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలు
స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నారు.

రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.

ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్‌ జగన్‌ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.

లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్
లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.

రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.

ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్‌డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement