
సాక్షి, నగరి: ఏపీలో కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధమని రోజా తెలిపారు. హోం మంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా నగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరు చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చి వేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి అనేది లేదు మీకు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు చూశారా?. మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు.
నాణ్యమైన వైద్యం అందించాలని చూశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లం మాదిరే తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో చిరాకు కనిపిస్తుంది. మహిళల భద్రత, అత్యాచారాలు జరిగిన ఘటనపై ఏనాడు అనిత స్పందించలేదు. వైఎస్ జగన్‌ను తిట్టడానికి ఫేక్ వీడియోలు ప్రదర్శిస్తూ ప్రజెంటేషన్ చేశారు. వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి, వాటిలో ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్‌లోకి తెచ్చారు.
మొదటిసారి సీఎం అయిన జగన్ చేసిన పని చంద్రబాబు మూడు సార్లు సీఎంగా ఎందుకు చేయలేకపోయారు. ఐదువేల కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఖర్చు చేయలేక పోతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని అనిత చెబుతున్నారు.. మరి పీపీపీ అంటే ఏమిటి?. రౌడీ షీటర్లకు ఇచ్చే పెరోలా?. ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేటీకరణ జీవో వెనక్కి తీసుకోవాలి. కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు అనే విధంగా మంత్రి సవిత ప్రవర్తన ఉంది. ఆమె మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి. మీ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం చేతకాలేదు.

నేను రాజమండ్రి, విజయనగరం, పాడేరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకు నేను వస్తాను. దమ్ముంటే మంత్రులు అక్కడికి రావాలి. వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను నేను చూపిస్తాను. చంద్రబాబు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకు విజన్ ఉంది .. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధిలో చేసింది శూన్యం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి అంటే ఏడేళ్లు పడుతుంది. ఎయిమ్స్ పూర్తి కావడానికి తొమ్మిది ఏళ్లు పట్టింది. మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయి అనే కనీస అవగాహన కూడా మంత్రులకు లేదు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలు అందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్కడున్నారు?.
రైతులకు యూరియా కూడా అందించలేని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుయ్యి గొయ్యి చూసుకోవాలి. లక్ష 97వేల కోట్లు 15 నెలల్లో అప్పులు చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్‌కి షూటింగ్స్ చేసుకోవడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది. పిఠాపురంలో ఓట్లు వేసిన ప్రజల్ని పవన్ పట్టించుకోవడం లేదు. నీకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.