‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’ | YSRCP Naga Malleswari Comments On Chandrababu Govt And Slams TDP Mahanadu Over DSC Row, More Details Inside | Sakshi
Sakshi News home page

‘అందుకే.. టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా’

May 28 2026 8:42 PM | Updated on May 29 2026 5:50 PM

Ysrcp Naga Malleswari Comments On Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్‌ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్‌ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్‌ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.

చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్‌పైనా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్‌ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్‌ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:

అందుకోసమేనా మీ ‘మహానాడు’?:
టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్‌గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.

స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:
రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్‌ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్‌ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్‌ను హైలైట్‌ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్‌ అవార్డు చంద్రబాబు, లోకేష్‌కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్‌ చేస్తున్నారు.

అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం:    
మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్‌ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్‌కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్‌గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్‌ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.

బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:
మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్‌ గారు మీటింగ్‌ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్‌ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్‌ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్‌బుక్‌ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.

ఇప్పటికీ ఎన్టీఆర్‌ పేరునే వాడుకుంటున్నారు:
ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్‌ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్‌ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్‌ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:
పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్‌ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికే టాప్‌ ర్యాంక్‌ ఎలా వచ్చిందో లోకేష్‌ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్‌ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్‌ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement