స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీల వాకౌట్‌ 

YSRCP MPs walkout protesting against privatization of visakha steel plant - Sakshi

ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని మా పార్టీ ఏమాత్రం సమర్థించదు

రాజ్యసభలో బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సభలో ప్రసంగించాక ఆ పార్టీ ఎంపీలు కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పనిచేస్తాయని.. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు.

ప్రైవేట్‌రంగ సంస్థలు కొంత మేర ఉపాధి కల్పించినా లాభార్జనే ఏకైక ధ్యేయంగా కంపెనీలను నడుపుతాయని తెలిపారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో స్టీల్‌ ప్లాంట్‌ నవరత్న సంస్థగా భాసిల్లుతోందన్నారు. దీన్ని ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని తమ పార్టీ ఎంతమాత్రం సమర్థించబోదని తేల్చిచెప్పారు. ‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థ. ఈ సంస్థ నష్టాలకు క్యాప్టివ్‌మైన్‌ లేకపోవడం, అత్యధిక వడ్డీతో రుణభారాన్ని మోయాల్సి రావడం కారణాలుగా ఉన్నాయి. అలాగే 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే ప్లాంట్‌ నిలబడుతుంది. క్యాప్టివ్‌మైన్‌ కేటాయించి.. రుణభారాన్ని ఈక్విటీ రూపంలోకి మారిస్తే ప్రైవేటీకరించాల్సిన అవసరం ఉండదు’ అని ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. 

విభజన చట్టం హామీల అమలులో కేంద్రం విఫలం
‘రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా విభజన చట్టంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక రైల్వే జోన్‌ హామీ కార్యరూపం దాల్చలేదు. కేంద్రం విఫలమైంది కాబట్టి రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తే.. తదనంతరం ఆ జోన్‌ను రైల్వేకు బదిలీ చేసే అధికారం రాష్ట్రానికి ఇస్తారా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 

కోకింగ్‌ కోల్‌ కొరత ఉంది 
దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్‌ కోల్‌ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? అని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలో కోకింగ్‌ కోల్‌ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

బృందం ఏర్పాటైంది: కేంద్ర ఆర్థిక శాఖ
మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు విధానాలు రూపొందించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top