చంద్రబాబు విలపించడం ఓ డ్రామా

YSRCP Leaders Comments On Chandrababu Naidu Breaks Down - Sakshi

సాక్షి, అమరావతి/నగరి: రాజకీయాల్లో చంద్రబాబులాంటి నీతిబాహ్యమైన నేతను ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మీడియా ముందు చంద్రబాబు విలపించడం ఒక డ్రామా అని మండిపడ్డారు. సాఫీగా జరుగుతున్న శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తల్లి – చెల్లి, బాబాయ్‌ – గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్‌ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదన్నారు. మహిళలను గౌరవించడంలో వైఎస్సార్‌సీపీ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. 

సీఎం వైఎస్‌ జగన్‌తో పోలికా? 
ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి వీల్లేకుండా సభను నడుపుతుండటం వల్లే 2017, డిసెంబర్‌ 21న నాటి ప్రతిపక్ష నేత జగన్‌.. సభను బాయ్‌కాట్‌ చేశారు.  చంద్రబాబు సం బంధం లేని అంశాలను సభలో ప్రస్తావించి.. అధికార పార్టీ సభ్యులు అనని మాటలను అన్నట్లుగా సృష్టించుకుని.. సభ నుంచి బాయ్‌కాట్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ నాడు సభను బాయ్‌కాట్‌ చేసిన దానికి.. నేడు చంద్రబాబు బాయ్‌కాట్‌ చేసిన దానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలపై చర్చిద్దామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అన్నారే తప్ప.. మరో రీతిలో మాట్లాడలేదు.  – పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు  

చంద్రబాబు గొప్ప నటుడు 
కుప్పం ఓటమి తర్వాత టీడీపీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు చంద్రబాబుకు వచ్చాయి. తండ్రీకొడుకు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఇంట్లోని మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనే నీచ ఆలోచనకు చంద్రబాబు వచ్చారు. పదవి కోసం ఎన్ని ఘోరాలు, నేరాలు చేశారో రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన గొప్ప నటుడని ఎన్టీఆర్‌ ఎన్నోసార్లు ప్రజలకు తెలియజేశారు.  – ప్రభుత్వ విప్, కొరముట్ల శ్రీనివాసులు  
 

బాబు నటన అమోఘం 
రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీలో ఆయన నటన అమోఘం. అసెంబ్లీలో, బయట ఏడ్వని చంద్రబాబు మీడియా ముందుకు రాగానే ఏడ్వడం మొదలుపెట్టారు. పూర్తి స్థాయి నటనతో మీడియా సమావేశాన్ని రక్తి కట్టించారు. అసెంబ్లీలో ఏ ఒక్కరూ చంద్రబాబు కుటుంబసభ్యులను, ఆయన భార్య గురించి మాట్లాడలేదు. బాబు డ్రామాల్ని ప్రజలెవరూ పట్టించుకోరు.  – వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌  
 

చంద్రబాబుది మొసలి కన్నీరు 
మహిళల ఉసురు చంద్రబాబుకు తగిలింది. అందుకే నేడు ఆయనకు ఈ దుస్థితి.  ఎన్టీఆర్‌ 72 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టీడీపీని, సీఎం పదవిని లాక్కొని చంద్రబాబు ఆయనను ఏడిపించారు. ఇప్పుడు బాబుకు 71 ఏళ్ల 7 నెలలకే ఏడ్చే పరిస్థితి వచ్చింది. గతంలో నన్ను, విజయమ్మ, భారతమ్మ, షర్మిళమ్మలను కూడా వేధించారు. ఆయన వల్ల ఏడ్చిన ప్రతి ఒక్కరి ఉసురు ఇప్పుడు బాబుకు తగిలింది.  –  ఎమ్మెల్యే ఆర్కే రోజా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top