న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి | Ysrcp Leader Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి

Apr 15 2026 9:35 PM | Updated on Apr 15 2026 9:35 PM

Ysrcp Leader Ambati Rambabu Fires On Chandrababu

సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.

‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు  నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది.

..నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.

పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ 
అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.

అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా.

ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement