
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్‌కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్‌లో ఐటీ సెంటర్‌ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన.
చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు.