చంద్రబాబు చీటర్‌ కాదా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Key Comments At YSRCP Guntur Leaders Meeting, Check His Speech Highlights | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చీటర్‌ కాదా?: వైఎస్‌ జగన్‌

Feb 13 2025 2:02 AM | Updated on Feb 13 2025 12:32 PM

 YS Jagan Mohan Reddy Key Comments At YSRCP Guntur Leaders Meeting

ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా?

పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

ముసలమ్మ కూడా బటన్‌ నొక్కుతుందన్న బాబు 

ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పమంటున్నారు

సీఎం మారాడు.. వైఎస్సార్‌సీపీ వెళ్లి టీడీపీ వచ్చింది.. ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లింది

ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లోకి వెళ్లగలరా? 

ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు.. కాలర్‌ పట్టుకుని నిలదీసే రోజు వస్తుంది

కలసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం  

ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్‌.. ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం.. ముఖ్యమంత్రి మారాడు..! వైఎస్సార్‌సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది..! అంతే తేడా...! ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకం మోసం.. అబద్ధం! కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ఎన్నికల ప్రచారంలో.. ముస­లమ్మ కూడా బటన్‌ నొక్కుతుంది అని చంద్ర­బాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ ఎందుకు బటన్‌ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు బటన్‌ ఎలా నొక్కాలో తన చెవిలో చెప్పమంటున్నారు. మొహ­మాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి చీటర్‌ కాదా?.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

‘మీరూ, మేమూ.. మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరా­చక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకెళదాం..’ అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మేయర్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు 

చరిత్రను మార్చిన జగన్‌ 1.0 పాలన..
2019–2024 మధ్య జగన్‌ 1.0 ప్రభుత్వం నడిచింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే.. చక్కటి అబద్ధాలను రంగు రంగుల కాగి­తాల్లో ముద్రించి ఎన్నికల్లో పంచడం..! ఎన్నికలు అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబు­ట్ట­లో వేయడం..! అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసి మొక్కలా వ్యవస్థను మార్చిన పాలన కేవలం వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది. 

చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మేనిఫెస్టోను కేవలం రెండు పేజీలకు కుదించి.. అది మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ లాంటిదని చెప్పి ఎన్నికలు అయిపో­యిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఎంవో, ప్రతి మంత్రి కార్యాలయంలో, ప్రతి కలెక్టర్‌ కార్యాలయంలోనూ కనిపించేలా ఏర్పాటు చేశాం.

బడ్జెట్‌తోపాటే సంక్షేమ క్యాలెండర్‌..
సంక్షేమ క్యాలండర్‌ను కూడా బడ్జెట్‌తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి.. అలా చెప్పిన తేదీకి బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన పార్టీ హయాంలోనే జరిగింది. 

అంతగా వ్యవస్థలో మార్పులు చేశాం. గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే... 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నాను­డిని మార్చి.. లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్‌ ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపి­స్తున్నా.. ఆదాయాలు తగ్గినా.. అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజూ సాకులు వెతకలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాం. 

హామీల అమలుతో పాటు అభివృద్ధి..
ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కూడా చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు – నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైంది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ స్కూళ్ల ప్రయాణం మొదలైంది. మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ క్లాసులు మొదలయ్యాయి. 

మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధన అందించాం. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందచేశాం. ఇవన్నీ రావడంతో ప్రైవేట్‌ స్కూళ్లు.. ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చదువుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.

వైద్యంలోనూ ఊహకందని మార్పులు..
తొలిసారిగా గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చేశాం. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా బలో­పేతం చేశాం. 

డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు గల ఔషధాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రొసీజర్లను వెయ్యి నుంచి ఏకంగా 3,300 వరకు తీసుకెళ్లడంతోపాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం.

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం..
గతంలో మనకు 50 శాతం ఓటు షేర్‌ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్‌ 40 శాతం ఉంది. 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం.. మీ జగన్‌ ఆ రోజు వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడమే. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్‌ లీడర్‌ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో ముద్ర వేయగ­లిగాడు. మీ జగన్‌ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. 2019–24 మధ్య మన పాలనను ప్రజలు చూశారు. ఇవాళ చంద్ర­బాబు పాలన కూడా ప్రజలు చూస్తు­న్నారు. 

మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా అబద్ధాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్న­ప్పుడు.. మరి ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబ­ద్ధాలు చెప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం ప్రజల ఓటుతో బంగా­ళా­ఖాతంలోకో ఇంకా అథఃపాతాళా­నికో పో­తారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగు­తాడు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగు­తారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ, ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేదు. 

వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా... చిన్నపిల్లలు తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి.. మరి మా రూ.48 వేలు పెన్షన్‌ డబ్బు­లు ఎక్కడని ప్రశ్ని­స్తారు. ఆ ఇంట్లో రైతు­లు అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన నా రూ.36 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.

రైతును చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు..
గ్రామాల్లో ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతన్నలకు తోడుగా నిలిచాం. అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను అసిస్టెంట్‌గా నియమించి రైతులను చేయి పట్టుకుని నడిపించేలా చర్యలు తీసుకున్నాం. తొలిసారిగా ఇ–క్రాప్‌ ద్వారా ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. 

రైతులందరికీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర దక్కేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవస్థను తొలగించాం. ఇవన్నీ వైఎస్సార్‌ సీపీ హయాంలోనే జరిగాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. అదే సచివాలయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఇంటికే వచ్చి పారదర్శకంగా సేవలు అందించారు.

బాబు  ష్యూరిటీ.. మోసం గ్యారంటీ
ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు తాము సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఇవ్వలేకపోతే కాలర్‌ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్‌ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement