బాబు రాక్షస పాలనపై పోరు | YS Jagan Mohan Reddy Key Comments On Andhra Pradesh Local Body Elections | Sakshi
Sakshi News home page

బాబు రాక్షస పాలనపై పోరు

May 28 2026 5:00 AM | Updated on May 28 2026 5:04 AM

YS Jagan Mohan Reddy Key Comments On Andhra Pradesh Local Body Elections

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు

‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్‌లెట్‌ విడుదల చేసిన జగన్‌ 

జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు  

జూన్‌ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో టౌన్‌హాల్‌ సదస్సు 

యువకులు, రైతులు, మహిళల సమక్షంలో చర్చ

జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు 

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలిచ్చి.. చంద్రబాబు బాదుడే బాదుడు 

దీనిపై అడిగితే చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది.. ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకుని పులి తిన్నట్టుగా తినేస్తున్నాడు 

చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టే  లేటెస్ట్‌గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్‌ పాలిటిక్స్‌  

పచ్చి మోసాలుగా సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు 

ఇంతగా అబద్ధాలను బుల్డోజ్‌ చేసి, పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో 

పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం 

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం 

చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని వైఎస్‌ జగన్‌ పిలుపు

‘‘స్టేట్‌ గవర్నమెంట్‌కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్‌ మీద రూ.31.62. లీటరు డీజిల్‌ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్‌ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్‌ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది’’

‘‘స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రయత్నం చేయాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్‌గా తీసుకుంటా’’

‘‘కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్‌ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్‌ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే!’’ 
-పార్టీ నేతలతో భేటీలో వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్‌ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం, దగా, వంచనను వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ పేరుతో రూపొందించిన బుక్‌లెట్‌ను వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ప్రతి కార్యకర్త వద్ద ఆ బుక్‌లెట్‌ ఉండాలని.. డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. 

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంపై వైఎస్‌ జగన్‌ ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా దీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రతి అడుగులో తోడుగా నిలవాలని నిర్దేశించారు. 

స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరిలో కలిగేలా చొరవ చూపాలని సూచించారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పని చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని.. ఒకవేళ అలా జరిగితే అది అక్కడి ఇన్‌ఛార్జ్‌ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ గట్టిగా సూచించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశి్చమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్‌’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఓట్లు తగ్గినా.. పెరిగినా డేంజరేనని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..  

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు 

బాబు రాక్షస పాలన.. ‘ముసలి పులి.. బంగారు కడియం’ 
రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి నాకన్నా ఏ కా­ర్యకర్తకు మైక్‌ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్ర­బాబు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూ­సి­న తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మో­సం గ్యారెంటీ’ అని రుజువైంది. వెన్నుపోటు.. విధ్వంసం.. అరాచకం.. అబద్ధాలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌.. దోపి­డీ.. అవినీతి.. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునా­యుడు పరిపాలన! ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పా.. ‘ఒక ముసలి పులి. బంగా­రు కడియం’ కథ! చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని! ఎన్నికలు అయి­పోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూ­డా జగన్‌ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తా­ను అని చెప్పి పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది.  

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు 
చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌ అన్నాడు. సూపర్‌ సెవెన్‌ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నావు కదా! రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అని అడిగితే మాట రాదు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు.. రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరం బడ్జెట్‌లో కూడా పెట్టలేదు కదా? అంటే దాని మీద మాట ఉండదు. 

50 ఏళ్లకే పెన్షన్‌ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్‌లో దాని గురించి కేటాయింపులు లేవు కదా? అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్‌ ఎక్కడా కనిపించదు. దీనిపై అడిగితే మా­త్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్క­డన్నా పొరపాటున చంద్రబాబునాయుడును నిద్రలేపి మా­విగన్‌ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు­లో ఇవన్నీ చూస్తున్నాం.  

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు  

పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే.. 
చంద్రబాబు 143 హామీల్లో మనందరికీ ప్రధానంగా పెట్రోలు, డీజిల్‌ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్‌ చూస్తే రూ.105 దాటింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్‌పై విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. స్టేట్‌ గవర్నమెంట్‌కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్‌ మీద రూ.31.62. లీటరు డీజిల్‌ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్‌ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్‌ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది.  

అందుకే బాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌.. 
ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మినహా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో నేను ఈ మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్‌ చేయాలి. ప్రజలను ఈ టాపిక్‌ నుంచి.. ఆ టాపిక్‌ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్‌గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్‌ పాలిటిక్స్‌ మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్యవంతులు.   

గర్వంగా కాలర్‌ ఎగరేసుకుని చెప్పగలం.. 
రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా.. నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా.. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా.. ఒక రైతు బాగుపడ్డాడు అన్నా.. ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా.. ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడ్డాడన్నా.. ఇవన్నీ ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్సార్‌సీపీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతా. మంచి చేశాం అని చెప్పి కాలర్‌ ఎగరేసుకుని.. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్‌లెట్‌ను రిలీజ్‌ చేస్తున్నాం.  

ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి.. ప్రతి ఇంటికీ చేర్చాలి 
బుక్‌లెట్‌లో అన్ని అంశాలను క్షుణ్నంగా మనం చదువుకోవడమే కాకుండా మన పారీ్టలో ప్రతి కార్యకర్త­కు ఈ రెండేళ్ల పాలనలో ప్రతి అంశం మీద అవగా­హ­న ఉండేలా రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్ల­ను వివరిస్తూ మొదటి ఏడాది మనం నిర్వహించిన ర్యాలీలు కార్యక్రమం అప్పట్లో బాగా జరిగింది. రెండో ఏడాది కూడా చంద్రబాబునాయుడు పాలన మీ­ద నిరసన తెలుపుతూ అంతకన్నా ఇంకా గొప్ప­గా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటినీ జూ­న్‌ 4 నుంచి 12 వరకు పార్టీ తరఫున చేపడుతున్నాం.  

‘సూపర్‌హిట్‌’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం..
ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి.. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్‌ చేసి, పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడు తప్ప.  

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్‌లెట్‌ ఇందుకే..
‘చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్‌ లెట్‌లో సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లతో ఏరకంగా ఆయన మోసం చేశాడనే దగ్గర నుంచి.. ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టి పిల్లలను రోడ్ల మీదకు తెచ్చాడనే పరిస్థితి నుంచి.. ఆరోగ్యశ్రీ దుస్థితి, విద్య, వైద్యం, వ్యవ­సాయం ఏరకంగా కు­ప్ప­కూలిపోయింది? అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి? లాంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యా­లు, అవినీతి అన్నీ కూడా క్లుప్తంగా ప్రతి ఒక్కరికీ అర్థ­మయ్యే రీతిలో ఈ బుక్‌లెట్‌ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. క్యూఆర్‌ కోడ్, డిజిటల్‌ కాపీలు ప్రతి కార్యకర్తకూ చేరేలా మన పార్టీ వెబ్‌సైట్‌లో కూడా ఈ బుక్‌లెట్‌ వివరాలు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.

చంద్రబాబుకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఇలా..  
జూన్‌ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలను ఒకవైపు ఎస్‌ఐఆర్, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూ­ల్‌ రూపొందించడం జరిగింది. జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ జూన్‌ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుకు సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ‘ఈనాడు’లో ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌ కాపీ.. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్ల కాపీలు.. (ఇవి నెట్‌లో, బుక్‌లెట్‌లో అందుబాటులోనే ఉన్నాయి) ప్రతి మండల కేంద్రంలో 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పాలు పంచుకోవాలి. 

మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకుని కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించాం. తరువాత జూన్‌ 8, 9వ తేదీల్లో వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్‌ హాల్‌ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌లెట్‌లోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరగా జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తా. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.  

Advertisement
 
Advertisement
Advertisement