
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
తప్పుడు కేసులకు అదిరేది లేదు... బెదిరేది లేదు
అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై నాపై అక్రమ కేసులు పెట్టాయి
అణగదొక్కాలని చూశాయి... అణచివేతలో నుంచి పుట్టిందే వైఎస్సార్‌సీపీ: వైఎస్ జగన్
చంద్రబాబు, కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొని... ప్రజల ఆశీర్వాదంతో ఎదిగా
ఇప్పుడూ ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేసి తీరుతా
నేను విజయవాడలోనే ఉన్నా.. ఏమైనా చేసుకోవచ్చు.. ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు
లిక్కర్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు
ఆ కేసును నీరుగార్చేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారు
బెయిల్ నిబంధనలను ఉల్లంఘించిన చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలి
‘‘అంతిమంగా న్యాయం, ధర్మం ఏవైపు ఉంటే దేవుడు ఆవైపు ఉంటాడు. న్యాయం, ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ, ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయించుకోవడానికి... ఇప్పుడు చేస్తున్న లిక్కర్ పాలసీని సమర్థించుకోవడానికి ఏ స్కామూ లేకపోయినా జరిగినట్లుగా చిత్రీకరించి, భేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం చేస్తే... దాంట్లో ధర్మం, న్యాయం లేనప్పుడు దేవుడు ఆశీర్వదించడు. చంద్రబాబు దుర్బుద్ధితో ఎంత చేసినా అది తాత్కాలికమే’’
‘‘నేను విజయవాడలోనే ఉన్నాను. వారు రావాలనుకుంటే రావచ్చు.. ఎవరు ఆపుతున్నారు’’
‘‘నీ ఇంటి దగ్గరికి బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే డీలర్ దగ్గరకి పోయి తీసుకోమంటే వారి టైమింగ్ ప్రకారం పోయి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతావా. ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల వ్యవస్థపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది?’’
‘‘ఇంటింటికీ రేషన్ డెలివరీ నిలిపివేయడంతో ఇప్పుడు బియ్యం కోసం రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే పోవాలి, ఆ రేషన్ డీలర్ తెలుగుదేశం పార్టీవాడు అయ్యుంటాడు. వైఎస్సార్‌సీపీ అనో ఇంకో పార్టీ అనో పోతే అతడు ఇవ్వడు. సతాయిస్తాడు. తన ఇంటికి రావాలి అంటాడు. సెల్యూట్ కొట్టాలంటాడు. అప్పుడే ఇస్తానంటాడు. ఎందుకొచ్చిన బాధలే అని వెళ్లడం మానేస్తారు. సో బియ్యం ఆటోమేటిగ్గా మిగులుతుంది. వీళ్లు చేసేది మాఫియా’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘వైఎస్సార్‌సీపీకి... వైఎస్ జగన్‌కు ఈ పోరాటాలు కొత్త కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి... నన్ను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేస్తేనే వైఎస్సార్‌సీపీ పుట్టింది... పెరిగింది... ప్రజల ఆశీర్వాదంతో జగన్ అనే వ్యక్తి ఎదిగాడు... ఈ పోరాటాలు మాకు కొత్తేం కాదు. తప్పుడు కేసులకు అదిరేది లేదు... బెదిరేది లేదు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తుందని, ఎన్ని కేసులు పెట్టి అణచివేయాలని చూసినా... చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తూ... ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... అక్రమ కేసులపై గళమెత్తుతూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేసేందుకు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలిచ్చారు. మద్యం కేసులో మిమ్మల్ని అరెస్టు చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు కదా.. మీరేమంటారు అని అడగ్గా.. తాను విజయవాడలోనే ఉన్నానంటూ స్పందించారు.
మద్యం డోర్ డెలివరీ.. ఇంటింటికీ రేషన్ రద్దు
‘‘అసలు రేషన్ బియ్యం ఇంటింటికీ పంపిస్తేనే కనీసం చంద్రబాబు ప్రభుత్వం చేప్పే ఈ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడ అక్రమాలు జరుగుతాయి? మొదట సార్టెక్స్ బియ్యాన్ని వీళ్లు ఆపేశారు. క్వాలిటీ పెంచి మేం సార్టెక్స్ బియ్యం ఇచ్చాం. దానివల్ల నూకలు తక్కువ వచ్చేవి. మధ్యస్త, సన్నకార, స్వర్ణ బియ్యాన్ని మాత్రం సేకరణ చేస్తుండేవాళ్లం. దీంతో తినేవాళ్లు ఉత్సాహం చూపేవారు. వీళ్లెవరూ ఇబ్బందిపడకుండా ఇంటి వీధి చివరికి పోయి అక్కడే డెలివరీ చేసేవారు. సాయంత్రం పూట సచివాలయం వద్ద బండి పెట్టుకుని అందుబాటులో ఉండేవారు. ఎవరైనా బియ్యం తీసుకోలేకపోతే... ఈ వెసులుబాటు వల్ల ఇంటికే వచ్చి ఇస్తున్నందున తీసుకునేవారు.
డోర్ డెలివరీ అనేది ఒక సర్వీసు. ఆ సర్వీసును తీసేయడం వీళ్లు చేసిన తప్పు. ఆ తప్పును సమర్థించుకుంటూ... ఆ తప్పును అంగీకరించకుండా, దానికి ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా... దాని మీద కూడా దుర్బుద్ధితో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల సంకుచిత రాజకీయ మనస్తత్వానికి ఇది నిదర్శనం’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బియ్యం పంపిణీని నిలిపివేసి... మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకోవడానికే..
‘‘విజయవాడ, గన్నవరం ఎయిర్‌పోర్టుల మధ్య 40 కిలోమీటర్ల దూరం కూడా లేదు. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అన్నది వర్కవుట్ కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి.. చంద్రబాబు, బినామీల భూముల ధరలు పెంచుకుని.. ప్రయోజనం పొందడానికే అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అంటూ మాటలు చెబుతున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ‘‘కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలు ఊసే లేదు. విద్యార్థులకు ఫీజులు అందడం లేదు.
పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు. 50 ఏళ్లకే పింఛన్లు ఇవ్వడం లేదు. హామీలు అమలు చేయడం లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలను వేధిస్తున్నారు’’ అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
⇒ ‘‘మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. తనపై నమోదైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.. బెయిల్ నియమ, నిబంధలన్నీ ఉల్లంఘించిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయకూడదు?’’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్
స్పందించారు.