సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమేనని.. ఇప్పుడు డీఎస్సీ విషయంలోనూ అదే జరిగిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో బాబు హయాంలో జరిగిన పేపర్ లీకేజీల చిట్టాను చదివి వినిపించిన వైఎస్ జగన్.. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసలు చంద్రబాబుగారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో టెన్త్ క్లాస్ పేపర్ల లీక్. 1996లో ఎంసెట్ ఇంజినీరింగ్ పేపర్స్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017 టెన్త్ సైన్స్ పేపర్ లీక్. 2019లో టెన్త్ పేపర్ లీక్. 2025లో బీఈడీ పేపర్ లీక్, 2025లో టెన్త్ మ్యాథ్య్స్ పేపర్ లీక్. ఇప్పుడు డీఎస్సీ టీచర్ల రిక్రూట్‌మెంట్ లీక్. లీకుల్లో చంద్రబాబు రికార్డు ఇది.
ఈ తప్పులను ఎత్తిచూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోంది. అందుకే ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుగారూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది జెన్‌జీ కాలం. ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా నడుస్తోంది. దేన్నీ ఆపలేరు. మీరు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై పెరుగుతుంది. దగాపడ్డ యువత మిమ్మల్ని విడిచిపెట్టదు. తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి. జాగ్రత్త..!
ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్ర్రబాబు ముందుకు రాడు. సరికదా.. ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

‘‘వారంరోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులంతా నావద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయపోరాటం చేస్తానని.. ఒకవేళ అప్పటికీ కాకపోతే.. మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని హామీ ఇచ్చా’’ అని వైఎస్ జగన్ మీడియాకు తెలిపారు.


