
సాక్షి, విశాఖపట్నం: కాలకేయుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఆర్కే రోజాపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడారన్న వరుదు కల్యాణి.. భాను ప్రకాష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రోజా మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించారా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఇష్టానుసారంగా మాట్లాడతారా?. రోజా మీద చేసిన వ్యాఖ్యలు మీ ఇంట్లో ఆడవారి మీద చేస్తే మీరు ఊరుకుంటారా?. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.
గతంలో బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న వంటి వారు రోజాపై అసభ్యకరంగా మాట్లాడారు. విజయమ్మ, భారతమ్మ గురించి ఐటీడీపీ వాళ్లు దారుణంగా ట్రోల్ చేశారు. మహిళలంటే టీడీపీకి గౌరవం లేదు. ఉప్పాల హారికపై దాడి మరువక ముందే ఆర్కే రోజా మీద అసహ్యంగా మాట్లాడుతున్నారు. మహిళా మీద దాడి జరిగితే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?. భాను ప్రకాష్ తాట ఎందుకు పవన్ తీయలేదు’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.
