రైతు బంధు ఆపాలని ఎక్కడా చెప్పలేదు | Sakshi
Sakshi News home page

రైతు బంధు ఆపాలని ఎక్కడా చెప్పలేదు

Published Sun, Nov 19 2023 4:24 AM

Uttam Kumar Reddy about Rythubandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు పంపిణీని ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని, కాంగ్రెస్‌ నేతలెవరూ ఎప్పుడూ అనలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు ఆపాలని కాదు, ఇంకా పెంచాలనే తాము డిమాండ్‌ చేశామన్నారు. శనివారం గాందీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా అసత్యాలు మాట్లాడుతున్న కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. 

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. 
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వమేనని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ అధికారంలో వచ్చి న తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరుతామని ప్రకటించారు. అలాగే వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని, రైతుబంధు కంటే మిన్నగా రైతు భరోసాను తీసుకొచ్చి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

విజయశాంతిని స్వాగతిస్తున్నాం 
కాంగ్రెస్‌ పార్టీ లోకి విజయశాంతిని స్వాగతిస్తున్నామని.. ఆమెను పార్టీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌గా హర్షణీయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆమె చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement