‘రీజనల్‌’కు రాష్ట్ర వాటా నిధులివ్వండి 

Union Minister Kishan Reddy Letter To CM KCR About Funds To Regional Ring Road - Sakshi

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ 

భూసేకరణ వ్యయంలో 50% త్వరగా విడుదల చేయండి 

బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లనూ విడుదల చేయకపోవడం దురదృష్టకరం 

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రోడ్డు నిర్మాణం జాప్యమవుతుందని వ్యాఖ్య 

సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50% నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు త్వరగా డిపాజిట్‌ చేయాలని సూచించారు.

హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రీజనల్‌ రింగు రోడ్డు పూర్తి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ వ్యయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగాన్ని భరించేలా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. 

కేటాయించిన నిధులూ విడుదల చేయరా? 
భారత్‌ మాల పరియోజనలో భాగంగా కేంద్రం రీజనల్‌ రింగు రోడ్డును మంజూరు చేసిందని.. ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణనూ వేగిరం చేసిందని కిషన్‌రెడ్డి వివరించారు. భూసేకరణ కోసం గెజిట్‌ నోటిఫి కేషన్‌ కూడా విడుదల చేసిందన్నారు. ‘‘భూసేకరణ వ్యయంలో 50శాతం మేర నిధులను డిపాజిట్‌ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయం అధికారి ఇప్పటికే 5 సార్లు లేఖలు రాశారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి లేవనెత్తిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. అయి నా తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదు. 2022–23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో రీజనల్‌ రింగు రోడ్డు భూ సేకరణ పేరుతో రూ.500 కోట్లు కేటాయించినా వాటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం దురదృష్టకరం..’’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. 

సకాలంలో స్పందించండి 
రీజనల్‌ రింగు రోడ్డు వల్ల హైదరాబాద్‌ నగరానికి రాకపోకలు సాగించే వాహనాల రద్దీని నియంత్రించటంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తారని, మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుందని కిషన్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ నిమిత్తమై తదుపరి 3డీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించడానికి సర్వే కూడా ముగిసిందన్నారు.

ఈ ఏడాది మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వడానికి ముందుకు రానట్లయితే.. ఈ 3డీ గెజిట్‌ నోటిఫికేషన్‌ వృథా అయిపోతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రాజెక్టు ప్రారంభం అనవసరంగా మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని, సకాలంలో నిధులు జమ చేయాలని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top