తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్‌గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్‌కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు.
“ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్‌ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.

Udhayanidhi Stalin again says
"SANATANA MUST BE ERADICATED."
CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు.
2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు.


