పాదయాత్రకు రేవంత్‌ సన్నాహాలు! ఓకే అయితే జూన్‌ 2 వరకు

TPCC Chief Revanth Reddy Padayatra Plan - Sakshi

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో అనుకూల తీర్మానం 

కార్యవర్గం నిర్ణయం మేరకు ముందుకెళ్లాలని ఠాక్రేకు ఖర్గే సూచన!  

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. అధిష్టానం నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్న తర్వాత భద్రాచలం నుంచి తన 126 రోజుల పాదయాత్రను ఆయన ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తాజా పర్యటనలోనే పాదయాత్రకు లైన్‌ క్లియర్‌ కానుందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఠాక్రే శనివారం హాజరుకానున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించనున్నట్టు సమాచారం. శనివారం పాదయాత్రకు సంబంధించిన తీర్మానం ఉంటుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే రేవంత్‌ పాదయాత్రపై రెండురకాల వాదనలు జరుగుతున్నాయి.  

నేడు స్పష్టత?: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ ఒక్కరే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం కావడాన్ని కొందరు పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం అనుమతి తీసుకోవడం ద్వారా అధిష్టానం దగ్గర లైన్‌ క్లియర్‌ చేసుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యవర్గం (పీఏసీ) తీర్మానం చేస్తే రేవంత్‌ పాదయాత్రను వద్దనాల్సిన అవసరం లేదనే భావనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని, ఇదే విషయాన్ని ఆయన ఠాక్రేకు చెప్పారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా పాదయాత్రను ప్రారంభించాలని రేవంత్‌కు ఠాక్రే సూచించారని, వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్త యాత్రకు అధిష్టానం నుంచి అనుమతి తీసుకుందామనే సంకేతాలను ఆయన రేవంత్‌కు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగానే యాత్ర ప్రారంభమైనా అది జూన్‌ 2 వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రేవంత్‌ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి కూడా పాలుపంచుకుంటారా? వంటి విషయాలపై శనివారం జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశం తర్వాత స్పష్టత 
రానున్నట్టు తెలుస్తోంది.
చదవండి: కేసీఆర్‌ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లొచ్చు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top