బీజేపీ వెనుకే టీడీపీ అడుగులు

Tirupati By Poll: TDP Secisions In Line With BJP Tactics - Sakshi

స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు అడుగులు వేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా టీడీపీ నిర్ణయాలు వెలువడుతున్నాయి. యాత్రల పేరుతో రచ్చ రాజకీయానికి తెరతీస్తున్నాయి. మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని కుయుక్తులు పన్నుతున్నాయి. అందులో భాగంగా కపిలతీర్థం టు రామతీర్థం అంటూ కమలనాథులు, ధర్మ పరిరక్షణయాత్ర అంటూ తెలుగు తమ్ముళ్లు రాగాలు ఆలపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

సాక్షి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే టీడీపీ, బీజేపీ నేతలు ముందస్తు దుష్ప్రచారానికి పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి కపిలతీర్థం టు రామతీర్థం యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తన హయాంలో వందల ఆలయాలను కూల్చిన విషయం వదిలేసి, పదిరోజుల ధర్మపరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో యాత్ర సాగించాలని నిర్ణయించారు.ఈ యాత్రలో పార్టీ శ్రేణులు తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  

మత రాజకీయాలే లక్ష్యం 
రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు పక్కదారులు తొక్కుతున్నాయని మేధావులు విమర్శిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయాలని ఎత్తులు వేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దేవాలయాలపై దాడులంటూ అవసరానికి మించి ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా మత రాజకీయాలు చేస్తున్నాయని వెల్లడిస్తున్నారు. 

మేమే నిజమైన పోటీ! 
వైఎస్సార్‌సీపీకి తామే నిజమైన ప్రత్యర్థి అని ప్రకటించుకునేందుకు టీడీపీ, బీజేపీ–జనసేన కూటమి తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హిందుత్వాన్ని భుజానికెత్తుకుని గుడ్డిగా పరుగెడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు ఆయా పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని పరిశీలకులు వివరిస్తున్నారు. అందుకే పోటాపోటీగా రాజకీయ తీర్థయాత్రలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయని వెల్లడిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top