మిజోరంలో జెడ్‌పీఎం జోరు! | Sakshi
Sakshi News home page

మిజోరంలో జెడ్‌పీఎం జోరు!

Published Tue, Oct 31 2023 12:45 AM

there three cornered fight northeastern state mizoram - Sakshi

ఈశాన్యాన బుల్లి రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. ప్రతి రెండు ఎన్నికలకు ఓసారి అధికార పార్టీని సాగనంపడం ఇక్కడి ప్రజలకు అలవాటు. అలా కాంగ్రెస్, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వంతులవారీగా అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కానీ ఈసారి జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) జోరుతో పోరు ఆసక్తికరంగా మారింది. దానికి తోడు గత రెండు దశాబ్దాలుగా ఇద్దరిని మాత్రమే సీఎంలుగా చూసిన రాష్ట్రానికి ఈసారి కొత్త ముఖాన్ని ఆ పాత్రలో చూసే అవకాశం దక్కుతుందా అన్నది కూడా ఆసక్తికరమే...

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంఎన్‌ఎఫ్‌ చేసిన పోరాటం ఫలించి 1987లో మిజోరం రాష్ట్రంగా ఏర్పడి నాటి నుంచి ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్‌ మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. ఈసారి పాలక ఎంఎన్‌ఎఫ్‌కే మొగ్గుందని భావిస్తున్నా కొత్తగా తెరపైకి వచ్చిన జెడ్‌పీఎం కాంగ్రెస్‌ను తోసిరాజని రెండో ప్రధాన పక్షంగా ఆవిర్భవించే దిశగా దూసుకెళ్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పలు పార్టీల కూటమిగా తెరపైకి వచ్చిన జెడ్‌పీఎం ఇప్పుడు ఒకే పార్టీగా రూపుదిద్దుకుంది.

పార్టీగా ఈసీ గుర్తింపు రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలోకి దిగి ఏకంగా ఆరు స్థానాలు నెగ్గి కాంగ్రెస్‌ను మూడో స్థానంలోకి నెట్టేసింది! ఈ ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే గాక యువతను బాగా ఆకట్టుకుంటోంది. పార్టీ అధ్యక్షుడైన మాజీ ఐపీఎస్‌ అధికారి లాల్‌డుహోమా (73)కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. మణిపూర్‌ హింసాకాండలో బాధితులుగా మారి రాష్ట్రం వీడిన కుకీ గిరిజనులకు ఆశ్రయం కల్పించడం తనకు బాగా కలిసొస్తుందని ఎంఎన్‌ఎఫ్‌ చీఫ్, సీఎం జోరాం తంగా లెక్కలేసుకుంటున్నారు.

కానీ ఇదొక్కటే ఆ పార్టీని గట్టెక్కిస్తుందని చెప్పలేమంటున్నారు పరిశీలకులు. ఆయన హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. అంతేగాక ఉపాధి కల్పన, చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాల వంటివేవీ లేకపోవడం కూడా బాగా మైనస్‌గా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలు జెడ్‌పీఎం వైపు చూస్తున్నట్టు కన్పిస్తోంది. 

కాంగ్రెస్‌ పొత్తు వ్యూహం 
జెడ్‌పీఎం ముప్పును గమనించిన కాంగ్రెస్‌ కాస్త వ్యూహం మార్చింది. పీపుల్స్‌ కాన్ఫరెన్స్, జోరాం నేషనలిస్ట్‌ పార్టీలతో ఈసారి జట్టు కట్టింది. ఓటర్ల మనోగతాన్ని మలచడంలో కీలక పాత్ర వహించే చర్చి, మిజోరం పీపుల్స్‌ ఫోరం మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. మూడు పార్టీలూ మొత్తం 40 స్థానాల్లోనూ బరిలో దిగాయి. 

మహిళలకు మొండిచేయి 
మిజోరం జనాభాలో క్రైస్తవులే మెజారిటీ. రాష్ట్రంలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువ కావడం మరో విశేషం! కానీ టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలకు మొండిచేయే ఎదురవుతూ వస్తోంది. మూడు పార్టీలూ కలిపి కూడా ఈసారి కేవలం ఆరుగురు మహిళలే బరిలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement