మిజోరంలో ముక్కోణం  | There is a three cornered fight in the northeastern state of Mizoram | Sakshi
Sakshi News home page

మిజోరంలో ముక్కోణం 

Oct 12 2023 5:17 AM | Updated on Oct 12 2023 7:58 AM

There is a three cornered fight in the northeastern state of Mizoram - Sakshi

ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ముక్కోణ పోరు నెలకొంది. పాలక మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), కాంగ్రెస్‌తో పాటు జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఈసారి హోరాహోరీగా తలపడుతున్నాయి... 

జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) రాకతో బుల్లి రాష్ట్రం మిజోరంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ మొత్తం 40 స్థానాలకూ అభ్యర్థులను బరిలో దింపింది. పార్టీ నాయకుడు లాల్‌దుహోమా గత ఉప ఎన్నికలో నెగ్గిన సెర్చిప్‌ నుంచే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక పాలక ఎంఎన్‌ఎఫ్‌ కూడా మొత్తం సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 15 కొత్త ముఖాలున్నాయి. ఇద్దరు మహిళలకు కూడా అవకాశం దక్కింది. సీఎం, ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు జోరాంతంగా ఐజ్వాల్‌ ఈస్ట్‌–1 నుంచే బరిలో దిగుతున్నారు. ఇక ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 

జెడ్‌పీఎం జోరు...! 
మిజోరం జనాభా కేవలం 11 లక్షలు. దశాబ్దాల తరబడి సాగిన చొరబాట్ల సమస్య అనంతరం 1987లో రాష్ట్రంగా ఏర్పడింది. నాటినుంచీ ప్రతి రెండుసార్లకు ఒకసారి చొప్పున అధికారం ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్‌ మధ్య చేతులు మారుతోంది. ఈసారి మాత్రం పాలక ఎంఎన్‌ఎఫ్‌కే కాస్త మొగ్గుందని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ జెడ్‌పీఎం గట్టి పోటీ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే ఆస్కారం కూడా లేకపోలేదని చెబుతున్నారు.

సరిగ్గా 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరేడు పార్టీల కూటమిగా పుట్టుకొచ్చిన జెడ్‌పీఎం ఆ తర్వాత ఒకే   పార్టీగా రూపుమార్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో చూస్తుండగానే పట్టు సాధించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటాలని భావిస్తోంది. మిజోరం జనాభాలో క్రైస్తవులే మెజారిటీ. వారి మనోగతంతో పాటు మయన్మార్‌ శరణార్థుల అంశం కూడా ఈసారి నిర్ణాయకంగా మారవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో నవంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు డిసెంబర్‌ 3న వెల్లడవుతాయి.  

2018లో ఇలా... 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్‌ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయగా బీజేపీ 39 స్థానాల్లో బరిలో దిగింది. ఎంఎన్‌ఎఫ్‌ 26, కాంగ్రెస్‌ 5 సీట్లు గెలవగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులుగా బరిలో దిగిన జెడ్‌పీఎం అభ్యర్థులు ఎనిమిది సీట్లలో నెగ్గారు. కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎంఎన్‌ఎఫ్‌ మిజోరంలో బీజేపీతో జట్టు కట్టకుండా విడిగానే పోటీ చేసింది. 

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement