దమ్ముంటే కేంద్ర బకాయిలు తెండి

Telangana Harish Rao Criticized Bandi Sanjay And Kishan Reddy - Sakshi

బండి సంజయ్, కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు సవాల్‌

కేంద్రం ఏడేళ్లుగా రూ. 7,183 కోట్లు ఇవ్వకుండా వేధిస్తోందని ధ్వజం

లెక్కలతో సహా చెప్పినా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొనడం హాస్యాస్పద మని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టడమే కాకుండా రూ. 7,183.71 కోట్ల బకాయిలను సైతం చెల్లించట్లేదని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఈ నిధులివ్వకుండా కేంద్రం వేధిస్తోందని దుయ్యబట్టారు.

బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు, పన్నుల వాటాను తీసుకురావాలని సవాల్‌ విసిరారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్‌లతో కలసి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని మంత్రి కేటీఆర్‌ లెక్క లతో సహా చెబితే బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

రాయచూర్‌ పల్లెలకు వెళ్దామా? 
పల్లెలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తెలంగాణ పల్లెల్లాగా ఇతర రాష్ట్రాల పల్లెలు ఎందుకు లేవని మంత్రి హరీశ్‌ ప్రశ్నించారు. ‘గద్వాలలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌ పక్కనే ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌ వెళ్తానంటే నేను కూడా వస్తా. అక్కడ పరిస్థితి చూసొద్దామా?’అంటూ సవాల్‌ విసిరారు. సంజయ్‌కి పాదయాత్రలో రాయ్‌చూర్‌ రైతులు తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తమకు కర్ణాటక బీజేపీ సీఎంతో ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారన్నారు.

పంచాయతీలకు నిధులన్నీ కేంద్రమే ఇస్తుంటే తెలంగాణలో ఉన్నట్లుగా దేశంలోని ఇతర గ్రామాల్లో ట్రాక్టర్లు, డంప్‌ యార్డులు, వైకుంఠధామాలు ఎందుకు లేవని హరీశ్‌ ప్రశ్నించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు సంజయ్‌కు కనిపించట్లేదా? అని నిలదీశారు. 

సెస్‌ల పేరిట రాష్ట్రాల ఆదాయానికి గండి
కేంద్రం సెస్‌ల రూపంలో రాష్ట్రాల ఆదాయాలకు గండి కొడుతోందని, పన్నుల్లో 41 శాతం వాటా రావాల్సి ఉన్నా 29.6 శాతానికి కుదించిందని హరీశ్‌రావు విమర్శించారు. ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రకు కేంద్రం తెరలేపిందని, 11 శాతం ఆదాయాన్ని సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తోందని ఆరోపించారు.

15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులివ్వాలని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆసరా పింఛన్లు ఇప్పటివరకు రూ. 48,273 కోట్లు ఇస్తే ఇందులో కేంద్రం వాటా కేవలం రూ. 1,640 కోట్లు అంటే 3.4 శాతమేనన్నారు. కర్ణాటకలో పెన్షన్‌ కింద రూ. 600 మాత్రమే ఇస్తున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. 

సంజయ్‌ మాటలకు నడిగడ్డ ప్రజలు నవ్వుతున్నారు... 
రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌)పై బండి సంజయ్‌ మాట్లాడుతున్న తీరును చూసి నడిగడ్డ ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం లో మంత్రిగా ఉన్న డీకే అరుణ ఆర్డీఎస్‌కు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్‌ న్యాయం చేశారని... అలాంటిది డీకే అరుణను ఆర్డీఎస్‌ అరుణగా పిలవాలని సంజయ్‌ పిలుపునివ్వడం జోక్‌ ఆఫ్‌ ది మిలీనియంగా మంత్రి అభివర్ణించారు. తుమ్మిళ్లను 10 నెలల్లో పూర్తి చేసి 55 వేల ఎకరాలకు నీరిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. సంజయ్, కిషన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తేవాలని డిమాండ్‌ చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top