
మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిర్వహణ
హాజరుకానున్న తాజా, మాజీ పీసీసీలు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్‌గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తాజా, మాజీ పీసీసీ అధ్యక్షులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ రెండురోజుల క్రితమే కులగణనపై కాంగ్రెస్ అధిష్టానానికి ఇందిరాగాంధీ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం జరిగే సమావేశంపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణలోని బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ భేటీకి హాజరవుతారు. ఆదివారం మాణిక్యం ఠాగూర్, మహేశ్‌గౌడ్ సహా పలువురు నేతలు కులగణనకు సంబంధించి సమావేశ నిర్వహణపై చర్చించారు. కులగణనపై దేశవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహించాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచి్చన హామీ మేరకే తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన ప్రకటన చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లేదా బిహార్‌లో కులగణన ప్రకటనలో కీలకపాత్ర పోషించిన రాహుల్‌కు ధన్యవాద సభ, భారీ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తోంది.