
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు అని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.
బతెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తొలగించాలి.
అహంకారపు ఆలోచనలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటున్నాం. వరి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.
హైదరాబాదే మన బలం.. హైదరాబాద్‌ను గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చి దిద్దుతాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చుతాం. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుతాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం. మూసీ చుట్టూ బ్రతుకుతున్న ప్రజలకు మెరుగైన జీవితం కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తాం. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మార్చుతాం. మూసీకి ఇరువైపులా ప్రపంచ స్థాయి కట్టడాలు నిర్మిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం. ఈ ఏడాది డిసెంబర్‌లో మూసీ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఫోర్తు సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి’ అని కోరారు.