
జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్షకు సిద్ధమైన వేళ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ రాజధాని రాంచీకి బయలుదేరారు. రాంచీలో రాహుల్ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రలో నేడు పాల్గొననున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి బయలుదేరారు. జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్షకు సిద్ధమైన వేళ.. రాష్ట్ర రాజధాని రాంచీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు రాంచీలోని ఇందిరాగాంధీ హ్యాండ్లూమ్ ప్రాసెస్ హౌజ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
జార్ఖండ్ అసెంబ్లీలో చంపయీ సోరెన్ నేడు బలపరీక్షను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ అరెస్టు కాగా.. నూతన సీఎంగా చంపయీ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2న జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణం చేశారు. కాగా జార్ఖండ్ లో రెండు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల తొలిరోజే చంపయ్ సోరెన్ బలపరీక్ష ఎదుర్కోనున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 41 మంది మద్ధతు అవసరం ఉంటుంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ప్రలోభాలకు లోనవుతారనే అనుమానంతో ఇన్నిరోజులు జార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను హైదాబాద్‌లోనే ఉంచారు. హైదరాబాద్ శిబిరంలోని ఎమ్మెల్యేలు నిన్న సాయంత్రమే రాంచీ చేరుకున్నారు. కొందరు తిరుగుబాటు చేస్తారన్న ప్రచారాన్ని మంత్రి ఆలంగీర్ ఆలం తోసిపుచ్చారు. తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేసిన చేశారు.
ఇదీ చదవండి: గృహజ్యోతికి కేబినెట్ ఆమోదం