దేశాన్ని అమ్మడమే ప్రధాని మోదీ పని 

Telangana: Ashannagari Jeevan Reddy Criticized On PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్నారని పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో పెట్టుబడులు రాబడుతూ దుమ్ము లేపుతుంటే ప్రధాని మోదీ, తెలంగాణపై దుమ్మెత్తి పోసేందుకు హైదరాబాద్‌ వచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలసి శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మేకిన్‌ ఇండియా నినాదాన్ని ప్రధాని మోదీ.. ఫేక్‌ ఇన్‌ ఇండియాగా మార్చారని, అంబానీ, అదానీలకు దేశాన్ని ధారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఏ బీజేపీ కార్యకర్త త్యాగం చేశాడో చెప్పాలన్నారు.  

తెలంగాణ వ్యతిరేకి మోదీ: బాల్క సుమన్‌ 
తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని బాల్క సుమన్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ది త్యాగాల కుటుంబమైతే బీజేపీ మాత్రం భోగాల కుటుంబంగా మారిందన్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని చెప్పడం అదానీకోసమేనన్నారు. కేసీఆర్‌ ప్రత్యామ్నాయ ఎజెండాను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని ఆయన అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top