దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు | Congress and Left spreading communal agenda to divide society | Sakshi
Sakshi News home page

దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు

Apr 3 2026 5:51 AM | Updated on Apr 3 2026 5:51 AM

Congress and Left spreading communal agenda to divide society

 కేరళ బీజేపీ కార్యకర్తల భేటీలో ప్రధాని మోదీ ఆగ్రహం  

న్యూఢిల్లీ:  కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్‌ కాంగ్రెస్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. 

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. 

దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్‌ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement