తండ్రి  బాటలో తనదైన ముద్రతో.. | gaurav gogoi political journey in assam politics | Sakshi
Sakshi News home page

తండ్రి  బాటలో తనదైన ముద్రతో..

Apr 3 2026 5:44 AM | Updated on Apr 3 2026 5:44 AM

gaurav gogoi political journey in assam politics

అస్సాం రాజకీయాల్లో గౌరవ్‌ గొగోయ్‌ 

గౌరవ్‌ గొగోయ్‌.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్‌ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్‌ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్‌ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్‌ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్‌ గొగోయ్‌ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు.  
మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి..  
గౌరవ్‌ గొగోయ్‌ తండ్రి దివంగత తరుణ్‌ గొగోయ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్‌ టేబుల్‌ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్‌ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్‌ కుమార్‌ సైకియాపై గెలిచి గౌరవ్‌ పార్లమెంటులో అడుగుపెట్టారు. 

2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్‌ ఆయనను లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 

2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్‌.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్‌ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.  

కొత్త కాంగ్రెస్‌ వర్సెస్‌ పాత కాంగ్రెస్‌... 
2024లో జోర్హాట్‌లో గౌరవ్‌ గొగోయ్‌ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్‌ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్‌కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్‌కు మధ్యే అంటున్నారు.  

కళలంటే ఆసక్తి.. 
గౌరవ్‌ గొగోయ్‌ 1982 సెపె్టంబర్‌ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్‌ కొలంబస్‌ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్‌టెల్‌ మార్కెటింగ్‌లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్‌లోని న్యూయార్క్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివారు. గౌరవ్‌కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్‌ తల్లి.. డాలీ గొగోయ్‌. యూకేకు చెందిన ఎలిజబెత్‌ క్లేర్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్‌ పౌరురాలైన ఎలిజబెత్‌ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్‌ఫర్డ్‌ పాలసీ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement