breaking news
legacy of his father
-
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్‌ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్‌కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్‌కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్‌లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్‌కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వారసులొచ్చారు..
బంజారాహిల్స్ : గ్రేటర్ రాజకీయాల్లో ‘నవశకం’ అడుగు పెట్టింది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బరిలోకి దిగారు. తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దినవారు ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఎత్తుపల్లాలు చూసేందుకు సిద్ధమయ్యారు. పితామహులే వారికి తమ రాజకీయ అనుభవాన్ని పాఠంగా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానమైన ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖేష్ గౌడ్ తనయ.. అబిడ్స్ మాజీమంత్రి ముఖేష్‌గౌడ్ 1986లో మొదటిసారి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన మంత్రిగానూ సేవలందించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయన కూతురు శిల్ప ఇప్పుడు గన్‌ఫౌండ్రీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రేటర్ బరిలోకి దిగారు. తండ్రి ముఖేష్ తొలిసారి రాజకీయ జీవితం ప్రారంభించిన ఏడాదిలో జన్మించిన ఈమె ఎంబీఏ చదివారు. ఇక్కడ ఈమె స్వయానా పిన్ని, బీజేపీ అభ్యర్థి సరితాగౌడ్తో పోటీ పడుతుండంతో రాజకీయ ఆసక్తి నెలకొంది. కేకే వారసత్వం.. శతృవులను కూడా మిత్రులుగా చేసుకొని ముందుకు సాగితేనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని తన తండ్రి రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు ఇచ్చిన సలహా పాటిస్తున్నానని బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి చెబుతున్నారు. బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజంలో డిప్లొమా చేసిన ఈమె, తనకు తండ్రి రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. సొంత నిర్ణయాలనే అమలు చేస్తానని, ఇష్టం లేని సలహాలు తన తండ్రి ఇచ్చినా పాటించనన్నారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, వారి అభిప్రాయాలే పరిగణలోకి తీసుకుంటానన్నారు. బరిలో పీజేఆర్ కుమార్తె.. హైదరాబాద్‌లో పీజేఆర్ పేరు వినని వారుండరు. ఆయన కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె పీజేఆర్ కూతురుగా సుపరిచితం. తండ్రి బాటలో నడవడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయనలాగే ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమవుతున్నారు విజయ. ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదివిన విజయారెడ్డి ఇప్పటికే రాజకీయ అనుభవం సంపాదించుకున్నారు. జనంతో మమేకమవుతూ సమస్యలను వింటూ పరిష్కార మార్గాలు చూపడంలో ఆమె పీజేఆర్‌ను అనుసరిస్తున్నారు. ‘బంగారు’ ఫ్యామిలీ నుంచి.. తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని, పెదనాన్న వారసురాలిగా బరిలోకి దిగినట్టు చెబుతున్నారు బంగారు స్రవంతి. వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈమె కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తమ్ముడు కూతురు. పెద్దనాన్న రాజకీయాలను దగ్గరి నుంచి చూసి స్పూర్తి పొందానని చెప్పారామె. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఏ చేసి ఇటీవల సివిల్స్ రాశానని, ఐఏఎస్ కావాలన్న లక్ష్యం ఉందన్నారు. ప్రజాసేవకు ఐఏఎస్ కాని రాజకీయం కాని దగ్గరి దారులని పేర్కొన్నారు స్రవంతి.


