తెలంగాణే 'గ్యారంటీ'! | CM Revanth Reddy slams Kerala CM Vijayan, KCR | Sakshi
Sakshi News home page

యూడీఎఫ్‌ గ్యారంటీల అమలుపై సందేహాలు వద్దు తెలంగాణే 'గ్యారంటీ'!

Apr 3 2026 1:22 AM | Updated on Apr 3 2026 1:22 AM

CM Revanth Reddy slams Kerala CM Vijayan, KCR

ఆ హామీలు ఎలా అమలవుతున్నాయో మా రాష్ట్రం వచ్చి చూడండి 

కేరళలో యూడీఎఫ్‌ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి 

అవినీతి, కుటుంబ పాలనలో కేసీఆర్, విజయన్‌ల మధ్య పోలికలు 

కేరళను మోదీ బ్రదర్స్‌ పాలిస్తున్నారంటూ విమర్శలు

సాక్షి హైదరాబాద్‌: కేరళలో యూడీఎఫ్‌ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యూడీఎఫ్‌ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్‌ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్‌ మాట్లాడారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు 
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్‌ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్‌ పేర్కొన్నారు. 

యూడీఎఫ్‌ స్వర్ణయుగ పాలన ఖాయం 
అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్‌ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్‌ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్‌ పాలిస్తున్నారని మోదీ.. విజయన్‌ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్‌ పాలన ముగిసి యూడీఎఫ్‌ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్‌ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement