సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్‌లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.
மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026


