దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసల వర్షం.. జైలు నుంచి విడుదలైన మరునాడే..

Some Good Decisions: Sanjay Raut Praises BJP Devendra Fadnavis - Sakshi

ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్టై విడుదలైన మరుసటి రోజే మహారాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలోని కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వ్యతిరేకించాలి కాబట్టి తాము వ్యతిరేకించమని.. అలా ఎప్పుడూ చేయలేదని తెలిపారు.

‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని నేను భావిస్తున్నాను. ఫడ్నవిస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నేను జైలులో వీలైనప్పుడల్లా న్యూస్‌పేపర్‌ చదివాను. పేదలకు గృహనిర్మాణం వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను స్వాగతిస్తాను’ అంటూ కొనియాడారు. కాగా మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి బీజేపీ గత జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసే ముందు గురువారం తన ఇంటి వద్ద సంజయ్‌ రౌత్‌ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. ‘మూడు నెలల్లో ప్రజలు నన్ను మర్చిపోతారని అనుకున్నాను. కానీ విడుదలైనప్పటి నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే నాతో క్రమం తప్పకుండా టచ్లో డేవారు. శరద్‌ పవార్  కూడా నాతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన కొన్ని పనుల కోసం ఫడ్నవీస్‌ను కలవనున్నాను.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నాను. వారిని కలిసి నాకు జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో రాజకీయ దుమారం తగ్గించాలంటూ ఫడ్నవీస్‌ చెప్పిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను’ అని  తెలిపారు. అదే విధంగా ఎన్‌‌సీపీ అధినేత శరద్ పవార్‌ను సైతం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు.
చదవండి: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌

తన అరెస్ట్‌ చట్టవిరుద్దమంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంజయ్‌ రౌత్‌ మాట్లాడారు.. ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అరెస్ట్‌ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. నేను జైలులో ఉండగా  నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. జైలులో నా ఆరోగ్యం దెబ్బతింది. జైలు జీవితం అంత సులువేమీ కాదు. అక్కడ ఎత్తయిన గోడలు ఉంటాయి. వాటితోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి

హిందూత్వ దిగ్గజం సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం గడిపారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్‌పాయి వంటి నాయకులు జైలులో గడిపారు. వీరంతా ఎలా గడిపారోనని తరచూ అనుకునేవాడిని. కానీ రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని నాకు నేనే చెప్పుకున్నాను. నేను వ్యవస్థను తప్పుపట్టడం లేదు. కోర్టు తీర్పు, ఈడీపై ఎలాంటి కామెంట్‌ చేయను. నా మౌనం వారికి సంతోషాన్ని కలిగిస్తే.. సంతోషపడనివ్వండి. నా మనసులో ఎవరిపై పగ లేదు. ఏ కేంద్ర దర్యాప్తు సంస్థను నిందించడం లేదు.’ అని వ్యా‍ఖ్యానించారు.

కాగా పాత్రాచల్‌ రీడెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఈడీ గత ఆగస్టు నెలలో సంజయ్‌ రౌత్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా తర్వాత కోర్టు జ్యూడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపారు. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి సంజయ్‌ రౌత్‌ బుధవారం విడుదలయ్యారు.  అయితే జైలు నుంచి విడుదలైన మరునాడే సంజయ్‌ బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 

చదవండి: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top