ఎందుకీ డ్రామాలు పవన్‌!? 

Seediri Appalaraju Fires On Pawan Kalyan - Sakshi

సీఎం జగన్‌ పాలనలో వారికి ఎంతో మేలు చేస్తుంటే అవహేళన చేస్తారా? 

వేట విరామంలో భృతి ఇవ్వని బాబును పవన్‌ ఏనాడైనా ప్రశ్నించారా? 

వైఎస్సార్‌సీపీ సర్కారు రూ.10 వేలు ఇస్తోందని తెలుసా? 

మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే 

మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్‌

పలాస (శ్రీకాకుళం జిల్లా): మాజీ సీఎం చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు ఏం చేయలేదని, ఇప్పుడు అన్ని రకాలుగా వారికి మేలు జరుగుతోందని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏమిటని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పశుసంవర్థక, మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని, హేళనగా మాట్లాడిన మాటలను మర్చిపోం అని ఆయనన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ వస్తే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు నిర్మిస్తున్న నాలుగు ఫిషింగ్‌ హార్బర్లను చూపిస్తానని, లేదంటే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ వెళ్లి పరిశీలించుకోవచ్చన్నారు. అలాగే, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని.. ఇందులో భాగంగానే ఆ వర్గం మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి రిటైల్‌ ఔట్‌లెట్లు, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తే అవహేళన చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. గతంలో మత్స్యకారులను ఉద్దేశించి ‘తోలు తీస్తా.. ఫినిష్‌ చేస్తా’ అని చంద్రబాబు అన్నప్పుడు ఏనాడూ స్పందించని పవన్‌ ఈరోజు వారిపై అకస్మాత్తుగా ప్రేమ కనబర్చడం వెనుక ఆంతర్యమేమిటన్నారు.

జనసేన ఆవిర్భావం నుంచి టీడీపీకి బీ టీమ్‌గానే వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. పవన్‌ స్వతంత్రంగా వ్యవహరించి తమ ప్రభుత్వంలో జరిగే మంచిని కూడా గ్రహించాలని మంత్రి హితవు పలికారు. మత్స్యకారులకు పక్కా ఇళ్లు లేవని.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత 32 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని.. రాబోయే రోజుల్లో ప్రతి మత్స్యకారుడు ఇల్లు లేదనే పరిస్థితి ఉండదన్నారు. జనసేన వైఖరి చూస్తుంటే టీడీపీని బలోపేతం చేయాలన్న తపన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

మత్స్యకారులకు టీడీపీ భృతి ఇచ్చిందా?
ఏప్రిల్‌–మే వస్తే మత్స్యకారులు వేట ఆపేయాలని.. ఆ సమయంలో బోటుకు రూ.4 వేలు ఇస్తామని అనేవాళ్లు తప్ప చంద్రబాబు ఏనాడూ ఇవ్వలేదని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. దీనిపై పవన్‌ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నించారు. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.10 వేలు ఇస్తున్నారని.. వారికి డీజిల్‌ సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు తెలుసా అని పవన్‌ను అడిగారు.

మత్స్యకారుడు వేటకు వెళ్లి చనిపోతే రూ.10 లక్షలు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, ఈ విషయమైనా తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపలు అమ్ముకుంటున్నారంటూ నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన కలిసే ఈ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.  జనసేనకు వీలైతే మంచి సలహాలు ఇవ్వాలి తప్ప సీఎం జగన్‌ను దూషిస్తామంటే ఏ మత్స్యకారుడూ స్వాగతించడన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top