
38 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో మూడో వంతు మందిని దారిలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళిక
అండగా ఉంటామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే భరోసా ఇస్తున్నారన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్లలో కట్టె పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే... మిమ్మల్ని దించుతామని చెప్పి దించి చూపెట్టాం. ఇప్పుడు కూడా స్పష్టంగా చెబుతున్నా. పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపు మీ పక్కన ఎవరూ ఉండరు. అలా వాళ్లు కోరుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి. పడగొట్టేది ఏంటో చెప్పండి. దాని పరిణామాలేంటో నేను చెప్తా..’ అని శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆన్‌రికార్డ్ మాట్లాడిన మాటలు ఇవి.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రేవంత్ భరోసా వెనుక ఉన్న ఆంతర్యమేంటన్న దానిపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పక్షాన ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. ఏ క్షణమైనా, పరిస్థితి ఎలా ఉన్నా ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగానే అన్ని రకాల మంతనాలు పూర్తయ్యాయని, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకున్నామని రేవంత్ సన్నిహితులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బీఆర్‌ఎస్‌తో బంధం తెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలు మినహా అందరూ టచ్‌లోకి వచ్చినట్లు వారు చెబుతుండటం చర్చనీయాంశమవుతోంది.
కర్ణాటక తర్వాత ఇక్కడేనా?
పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా, కర్ణాటక రాజకీయాల్లో మార్పులను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదా అన్నది తేలుతుందని ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మంచి మెజార్టీతో మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చి, కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారును పడగొట్టగలిగితే తెలంగాణలోనూ కచ్చితంగా ఆపరేషన్ ఉంటుందని కమలనాథులు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక టీమ్ ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది.
అనివార్య పరిస్థితులు వస్తే ఏకంగా బీఆర్‌ఎస్ శాసనసభాపక్షాన్ని (బీఆర్‌ఎస్‌ఎల్పీ) కాంగ్రెస్‌లో విలీనం చేసే లక్ష్యంగానే ఇది సాగుతోందని సమాచారం. ఈ భరోసాతోనే మీడియా సమావేశంలో రేవంత్ భరోసాతో కూడిన వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం తనను కలిసిన ఎమ్మెల్యేలు కూడా అండగా నిలుస్తామని, నిజంగా అలాంటి పరిస్థితులు వస్తే తాము నిలబడతామని చెబుతున్నారని రేవంత్ వెల్లడించడం గమనార్హం.