వాళ్లు కేటీఆర్‌ పంపిన గూండాలే

Revanth Reddy Comments On KCR And KTR - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ

కేసీఆర్‌తో నాకు ప్రాణహాని ఉంది 

నా ఇంటిపై దాడి చేసిన వారిపై కాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలపై కేసులా? 

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పంపిన టీఆర్‌ఎస్‌ గూండాలు తన ఇంటిపైన, తన అనుచరులపైన దాడులు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తన ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఇదెక్కడి చట్టమని నిలదీశారు. సీఎం కేసీఆర్‌తో తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. మంగళవారం రేవంత్‌ ఇంటి వద్ద కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి టీఆర్‌ఎస్‌వీ నేత ఒకరు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో.. సోమాజిగూడ డివిజన్‌ కాంగ్రెస్‌ నేత నారికేళ్ళ నరేష్‌ను బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ విషయం తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డి.. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఇతర అధికారులతో మాట్లాడారు. పోలీసుల కనుసన్నల్లోనే తన ఇంటిపై దాడి జరిగిందని, సీసీ టీవీ ఫుటేజీలు కూడా ఉన్నాయని చెప్పారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఇళ్లకు పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను ఇప్పటివరకు నాలుగు ఫిర్యాదులు చేసినా ఒక్క కేసు కూడా నమోదు చేయకపోగా కనీసం విచారణ కూడా చేపట్టలేదని చెప్పారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తుతున్న అధికారుల వివరాలను డైరీలో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి రాగానే వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.  

తెలంగాణను బిహార్‌లా మార్చాలని చూస్తున్నారు 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంతమంది బిహార్‌కు చెందిన పోలీసు అధికారులను ఉన్నత స్థాయిలో నియమించి తెలంగాణను బిహార్‌గా మార్చాలని చూస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. తనకు కేసీఆర్‌ నుంచి ప్రాణహాని ఉందంటూ.. తన ఇంటి చుట్టూ గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పారు. తనకు అదనపు భద్రత విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

తాజాగా ఫిర్యాదు
రేవంత్‌రెడ్డి ఇంటిపై టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తల దాడికి సంబంధించి ఆయన పీఏ పురుషోత్తంరెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలావుండగా టీఆర్‌ఎస్‌వీ నేత కడారి స్వామియాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వన్నెరు గణేష్‌ సహా కొందరు కాంగ్రెస్‌ నేతలపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఖైరతాబాద్, జగద్గిరిగుట్ట కాంగ్రెస్‌ నేతలు రవీంద్ర నాయక్, తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top