Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే!

Rajasthan elections Out of 1875 651 are crorepatis this time - Sakshi

రాజస్థాన్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కళంకిత అభ్యర్థులతో పాటు కోటీశ్వరులైన నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల్లో ఈసారి ఏకంగా 651 మంది కోటీశ్వరులు ఉన్నారు. 

ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 3.12 కోట్లు కాగా, గత ఎన్నికల్లో ఇది రూ. 2.12 కోట్లు. అభ్యర్థులు సమర్పించిన ఎలక్షన్‌ అఫిడవిట్ల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది.

ఈ నివేదిక ప్రకారం.. కోటీశ్వరులైన అభ్యర్థుల్లో బీజేపీ నుంచి 160 మంది, కాంగ్రెస్ నుంచి 149 మంది ఉన్నారు. ఎనిమిది మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. చురు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రఫీక్‌ మండెలియా అత్యంత సంపన్న అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ రూ.166 కోట్లు. ఆయన తర్వాత నీమ్‌కథానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజౌర్ రూ.123 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక  నింబహెరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజన మూడో స్థానంలో నిలిచారు. 

ఇక కేసుల విషయానికి వస్తే.. ఈసారి 236 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిలో బీజేపీకి చెందిన 42 మంది, కాంగ్రెస్‌కు చెందినవారు 34 మంది, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ అభ్యర్థులు 24 మంది ఉన్నారు. అలాగే ఆప్‌కు చెందినవారు 15 మంది, సీపీఎంకు చెందిన 12 మంది, బీఎస్‌పీకి చెందిన 8 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top