
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కూటమి వేధింపులు కొనసాగుతున్నాయి. పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడిని నిరసిస్తూ శాంతియుతంగా చేసిన ర్యాలీపై ఎన్నికల కోడ్ ఉల్లంఘిచారంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.
న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సురేష్ రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై కూడా దాడి చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణులపై వరుస దాడులు, హత్యాయత్నాలపై వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ముందురోజే నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఎమ్మెల్సీపై దాడి జరిగేది కాదని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.