చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు | Priyanka Gandhi Fires On BJP in Lok Sabha | Sakshi
Sakshi News home page

చాణక్యుడు బతికి ఉంటే.. బీజేపీ చాతుర్యానికి ఆశ్చర్యపోయేవాడు

Apr 17 2026 4:55 AM | Updated on Apr 17 2026 7:12 AM

Priyanka Gandhi Fires On BJP in Lok Sabha

ఈ స్కీమ్‌ వెనుక అమిత్‌ షా ఉన్నారు 

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ధ్వజం  

న్యూఢిల్లీ: చాణక్యుడు ఇప్పుడు గనుక బతికి ఉంటే బీజేపీ నాయకుల రాజకీయ చాతుర్యం చూసి ఆశ్చర్యపోయేవాడని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గురువారం మూడు బిల్లులపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, దేశ సమగ్రతపై అతిపెద్ద దాడి ప్రారంభించిందని ఆరోపించారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే మరోవైపు ఓబీసీల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేసి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. తన మాటలకు అమిత్‌ షా నవ్వుతున్నారని, ఈ స్కీమ్‌ వెనుక ఆయనే ఉన్నారని చెప్పారు. 

అమిత్‌ షా నవ్వుతున్నారంటే తన వ్యాఖ్యలతో ఆయన ఏకీభవించినట్టేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఏకైక చాంపియన్‌గా మారాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ప్రియాంక తేల్చిచెప్పారు. ‘ఒక ఓటు, ఒక పౌరుడు, ఒకే విలువ’అనే విధానాన్ని కాంగ్రెస్‌ తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు లభించిందన్నారు. అమెరికాలో ఓటు హ క్కు కోసం మహిళలు 150 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. 
 
ఇప్పుడున్న స్థానాల ఆధారంగానే రిజర్వేషన్లు  
కేవలం అధికారం కోసమే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని మోదీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉనికిలో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళా కోటా చట్టాన్ని డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెట్టారో చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న స్థానాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement