
- సినీ పరిశ్రమకు అడ్డంగా నిలబడటం అంటే ఇదేనా?
- అప్పుడు ఊగిపోయింది.. అంతా డ్రామానేనా?
- ఇప్పుడు రగిలి పోవడమే మీ నిజ స్వరూపమా?
- డిప్యూటీ సీఎం పవన్ పై రాజకీయ విమర్శలు
ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.
మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?
డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..
సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.
సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.